శశికళకు ఉద్వాసనWed,September 13, 2017 02:53 AM

-ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలిగించిన పార్టీ కౌన్సిల్
-దినకరన్‌పైనా వేటు.. మన్నార్‌గుడి మాఫియాకు చెక్
-సర్వాధికారాలు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి చేతికి
-జయలలితకు శాశ్వత ప్రధాన కార్యదర్శి హోదా
-కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న దినకరన్
aiadmk
చెన్నై, సెప్టెంబర్ 12: జయలలిత మరణానంతరం అధికారం చేపట్టి చక్రం తిప్పాలని భావించిన ఆమె నెచ్చెలి వీకే శశికళకు అన్నాడీఎంకే ఉద్వాసన పలికింది. మంగళవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తూ తీర్మానం చేశారు. ఆ హోదాలో ఆమె జరిపిన నియామకాలన్నింటినీ రద్దు చేశారు. శశికళ జైలుకు వెళ్తూ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు సైతం ఉద్వాసన తప్పలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆ పదవిని శాశ్వతంగా ఆమెకే కేటాయించడం సరైన నివాళి అని పేర్కొన్నారు. జయలలిత నియమించిన ఆఫీస్ బేరర్లను కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీని నడిపేందుకు కొత్తగా కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్ పదవులు సృష్టించారు. ఈ పోస్టుల్లో ఉన్నవారికి పార్టీ ప్రధాన కార్యదర్శితో సమానంగా అధికారాలు కట్టబెట్టారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, సీఎం పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు.
sasikala

మళ్లీ పార్టీలోకి వస్తాం: దినకరన్

శశికళతోపాటు, తనను పార్టీ నుంచి తొలిగించడంపై టీటీవీ దినకరన్ స్పందించారు. కోర్టు తుదితీర్పు తమకు అనుకూలంగా వస్తుందని, తాము తిరిగి పార్టీలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. పార్టీ సర్వసభ్య సమావేశాన్ని జరిపి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళకు మాత్రమే ఉన్నదన్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సూచనలు ఇవ్వాలని డీఎంకే పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు నియమించిన స్వతంత్ర పరిశీలకుడి సమక్షంలో అసెంబ్లీలో బలపరీక్ష జరుపాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

451

More News

VIRAL NEWS