ఈబీసీ కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం


Thu,January 10, 2019 12:17 PM

After Lok Sabha Quota Bill passes Rajya Sabha test

-165/7 ఓట్లతో రాజ్యాంగ సవరణకు ఆమోద ముద్ర
-అగ్రవర్ణ పేదలకు ఇక 10శాతం రిజర్వేషన్
-బిల్లుపై వాడివేడిగా జరిగిన చర్చ
-ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వర్తిస్తాయన్న కేంద్రం
-అర్హత పరిమితులను సడలించే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఉంటుందని వెల్లడి
-ఓటింగ్ అనంతరం సభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 9: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలలోని పేదల అభిమానాన్ని పొందే లక్ష్యంతో సంచలనాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు, 2019కి రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు పది గంటల సుదీర్ఘ చర్చ అనంతరం రాత్రి 10 గంటలకు బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 165 మంది, వ్యతిరేకంగా ఏడుగురు ఓటు వేశారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున ఆర్టికల్ 368 ప్రకారం మూడింట రెండువంతుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ మెజారిటీతో రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి కూడా దీనిపై తన ఆమోదముద్ర వేస్తే అది చట్టంగా రూపొంది ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది. ఈ బిల్లుతో దేశంలో రిజర్వేషన్ల కోటా 60 శాతానికి పెరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయనగా మోదీ ప్రభుత్వం అనూహ్యంగా ఈ బిల్లును తెరపైకి తెచ్చింది.
RajyaSabha1
బిల్లును సోమవారం క్యాబినెట్ ఆమోదించడం, ఆ మరుసటి రోజు లోక్‌సభ, ఆ తరువాత రాజ్యసభ ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ బిల్లును దాదాపు అన్ని పార్టీలు సమర్థించినప్పటికీ దానిని తీసుకువచ్చిన సమయాన్ని, దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నించాయి. రాజ్యసభ మంగళవారమే నిరవధికంగా వాయిదా పడాల్సి ఉండగా, ఈ బిల్లు కోసం బుధవారం వరకు పొడిగించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానంపై ఓటింగ్ జరుగగా, 18 మంది అనుకూలంగా 155 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. అలాగే బిల్లుకు పలువురు ప్రతిపక్ష సభ్యులు చేసిన సవరణలు కూడా ఆమోదం పొందలేదు. కొన్నింటిపై ఓటింగ్ కూడా జరిగినప్పటికీ అవి వీగిపోయాయి. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. బిల్లుపై జరిగిన చర్చకు సామాజిక న్యాకశాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ సమాధానమిస్తూ, కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందని, వారైనా రాజ్యాంగ సవరణ చేయకుండా తమ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చేవారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పరిశీలనలో కూడా ఈ బిల్లు నిలబడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల ఎస్సీ/ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఎటువంటి నష్టం ఉండదని అన్నారు.

నిరసనల మధ్య సభలో బిల్లు

కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య ప్రభుత్వం బుధవారం ఉదయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సభ్యుల గందరగోళం మధ్యనే సాంఘిక సంక్షేమం, సాధికారత శాఖల మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. జనరల్ క్యాటగిరీలోని ఆర్థికంగా బలహీనవర్గాల వారికి విద్యా, ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్‌గా ఈ బిల్లును ప్రతిపక్షం విమర్శించింది. బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఆమ్‌ఆద్మీ పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. బిల్లును పరిశీలన నిమిత్తం సెలెక్ట్ కమిటీకి పంపాలని, తన తీర్మానంపై సభలో ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే సభ్యురాలు కనిమొళి డిమాండ్ చేశారు. కనిమొళి డిమాండ్‌కు కాంగ్రెస్, సీపీఐతోపాటు ఇతర పార్టీల సభ్యులు కూడా మద్దతు తెలిపారు. కానీ చర్చ జరిగిన తరువాతనే ఓటింగ్ జరుగుతుందని డిప్యూటీ చైర్మన్ తేల్చి చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపాదనకు మద్దతునిచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ, బీస్పీ నిరాకరించాయి. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం తెస్తున్న బిల్లును ప్రతిపక్ష సభ్యులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణను కాంగ్రెస్ నాయకుడు ఆనంద్‌శర్మ తీవ్రంగా వ్యతిరేకించారు. తాము బిల్లుకు మద్దతునిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో జోక్యం చేసుకొనేదిగా ఉంది అని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా పేర్కొన్నారు. ఇంత తొందరపాటుగా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరమేమొచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీ ప్రశ్నించారు.
RajyaSabha2

బిల్లు చారిత్రాత్మకం

మంత్రి గెహ్లాట్ బిల్లును ప్రవేశపెడుతూ, రాజ్యాంగ సవరణ బిల్లు చారిత్రకమైనది, జనరల్ క్యాటగిరీలోని పేదలకు సమాన అవకాశాలు కల్పిస్తుంది అని పేర్కొన్నారు. మునుపటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి ప్రయత్నం చేశాయని, కానీ రాజ్యాంగం ప్రకారం అటువంటి అవకాశం లేనందున కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. అయితే నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్థికంగా బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును తెచ్చిందని చెప్పారు. ఇది తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించడం లేదని, దీంతో జనరల్ క్యాటగిరీలోని పేదలు అవకాశాలను కోల్పోతున్నారని మంత్రి చెప్పారు. తీవ్ర తర్జనభర్జన అనంతరం బిల్లును తేవాలని నిశ్చయించామని మంత్రి చెప్పారు. ఈ బిల్లు వల్ల కోట్ల మంది పేదలు లబ్ధి పొందుతారని, ఈ చారిత్రాత్మకమైన రోజును ప్రజలు ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారని అన్నారు.

దమ్ముంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టండి: ఆనంద్‌శర్మ

బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మ మాట్లాడుతూ, మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు ఒక క్యారట్ విసురుతున్నారని విమర్శించారు. దమ్ముంటే మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన సవాలు చేశారు. బేటీ బచావో బేటీ పఢావో వంటి నినాదాలు ఇవ్వటం కాదు.. మీకు నిజంగా మహిళల పట్ల ప్రేమ ఉంటే మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టండి.. ఈ రాత్రే దానిని ఆమోదించేద్దాం అని అన్నారు. ఓబీసీల రిజర్వేషన్ కోటాను 54 శాతానికి పెంచాలని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎలాగూ బద్దలుకొడుతున్నారు గనుక ఓబీసీల రిజర్వేషన్‌ను పెంచాలని చెప్పారు. బిల్లును అన్నాడీఎంకే సభ్యుడు ఏ నవనీతకృష్ణన్ వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది, అస్థిరమైనది అని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌సింగ్ మాట్లాడుతూ, గత 90 ఏండ్లలో ఒక్క దళితుడిని కూడా తమ అధిపతిగా ఎన్నుకోని ఆరెస్సెస్ రానున్న రోజుల్లో దళితులకు, బీసీలకున్న రిజర్వేషన్‌ను పూర్తిగా ఎత్తివేస్తుందని అన్నారు. ఆదాయం పన్ను చెల్లింపునకు వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలుగా ఖరారుచేసిన ప్రభుత్వం రూ.8లక్షలు వార్షికాదాయం వచ్చే వారిని పేదలుగా ఎలా విశ్లేషిస్తుందని మరో సభ్యుడు ప్రశ్నించారు.

ఆర్థిక వెనుకబాటుపై లెక్కలు సేకరించారా?: కపిల్ సిబల్

Kapil
ఈ బిల్లు మూడు నాలుగు ప్రధాన ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ హెచ్చరించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన జనాభా వివరాలను ప్రభుత్వం సేకరించిందా అని ఆయన ప్రశ్నించారు. ఓబీసీలు, దళితులు మెజారిటీగా ఉన్న రాష్ర్టాల్లో ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారని అడిగారు. ఎంతమందికి ఐదెకరాల కన్నా తక్కువ భూమి, వంద గజాల ప్లాటు, వెయ్యి గజాలలో ఇల్లు ఉంది? దీనికి సంబంధించి ఏమైనా వివరాలు సేకరించారా?ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై మండల్ కమిషన్ నివేదికను అమలు చేసేందుకు పదేండ్లు పట్టింది. ఇప్పుడు ఎటువంటి జనసంఖ్య వివరాలు లేకుండా బిల్లును ఆమోదిస్తున్నారు. ఇది కూడా నోట్ల రద్దులాగా ఓ బూటకపు ఎత్తుగడగా మిగిలిపోతుంది. గత ఐదేండ్లలో మీ ప్రభుత్వం ఏటా 45 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుంది. వాటిలో అగ్రకులాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 4,500 ఉద్యోగాలు వస్తాయి. అంటే.. కేవలం 4,500మందికి లబ్ధి చేకూర్చేందుకు ఈ బిల్లు తెస్తున్నారా? అని సిబల్ నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 10 శాతం కోటా

RAVI
జనరల్ క్యాటగిరీలోని పేదలకు కల్పిస్తున్న 10శాతం రిజర్వేషన్ సదుపాయం ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వర్తిస్తుందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవసరమైన ఆర్థిక ప్రాతిపదికను నిర్ణయించే అధికారం ఈ బిల్లు రాష్ర్టాలకు ఇస్తుందని చెప్పారు. ఈ బిల్లు ప్రకారం, వార్షికాదాయం రూ.8 లక్షలు మించనివారు, ఐదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు ఈ రిజర్వేషన్ సదుపాయం పొందేందుకు అర్హులు. అయితే ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఖరారుచేసే స్వేచ్ఛను ఈ బిల్లు రాష్ర్టాలకు కల్పిస్తుందని మంత్రి రవిశంకర్ వివరించారు. ఉదాహరణకు, ఈ రిజర్వేషన్ సదుపాయం పొందేందుకు అర్హతను వార్షికాదాయం రూ.5 లక్షలుగా రాష్ర్టాలు ఖరారు చేయవచ్చని చెప్పారు. ఆ మేరకు రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పిస్తుందని తెలిపారు. బిల్లును హడావుడిగా ప్రవేశపెడుతున్నారన్న విమర్శకు బదులిస్తూ..క్రికెట్‌లో చివరి ఓవర్లలో సిక్స్‌లు పడుతుంటాయి. ఇది మా మొదటి సిక్స్. మరిన్ని సిక్సర్లు పడనున్నాయి వేచి చూడండి. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఓడిపోవాలో ప్రజలు నిర్ణయిస్తారు అని అన్నారు.

1667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles