రెండు కబేళాలపై నిషేధం

Tue,March 21, 2017 02:37 AM

పారదర్శకంగా, ఒత్తిళ్లకతీతంగా పనిచేయాలని అధికారులకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశం

యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఎన్నికల హామీల అమలు దిశగా కంకణ బద్ధులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని డీజీపీ జావెద్ అహ్మద్‌ను ఆదేశించారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో సంకల్ప్ పత్ర అమలుకు 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Yogi-Adityana
లక్నో/ న్యూఢిల్లీ, మార్చి 20:ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్‌లోని రెండు కబేళాలపై నిషేధం విధించారు. యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే బీజేపీ ఎన్నికల ప్రణాళిక అమలుకు నడుం బిగించారు. అలహాబాద్‌లోని రాంబాగ్, అటాలా కబేళాలను మూసేయాలని జిల్లా పోలీసులను ఆదేశించినట్టు సోమవారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డీజీపీ జావెద్ అహ్మద్‌ను ఆదేశించారు. అలహాబాద్‌లో బీఎస్పీ నాయకుడు మృతి చెందిన కొద్దిగంటల తర్వాత జరిగిన సమీక్షలో మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుదలలో ఎటువంటి లోపానికి తావివ్వొద్దని స్పష్టం చేశారు. 75 జిల్లాల మేజిస్ట్రేట్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయం లోక్‌భవన్‌లో గంట సేపు జరిగిన సమావేశంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఎజెండా అమలులో భాగంగా అన్ని వర్గాలకు వివక్షా రహిత పాలనను అందించాలని స్పష్టం చేశారు. అధికారులకు బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో సంకల్ప్ పత్ర ప్రతులను అందజేయడంతోపాటు దాని అమలుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. 15 రోజుల్లో అధికారులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ కూడా పాల్గొన్నారు. అంతకుముందు వీవీఐపీ అతిథి గృహంలో బస చేసిన సీఎం ఆదిత్యనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ కలుసుకున్నారు. మంత్రులు శ్రీకాంత్‌శర్మ, సిద్ధార్థనాథ్ సింగ్ మినహా మరే మంత్రి కూడా మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపికలో ఆరెస్సెస్ జోక్యమే లేదని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఓ వార్తాసంస్థతో చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల పునరేకీకరణతో లబ్ధి పొందేందుకే ఆరెస్సెస్ ఆదిత్యనాథ్‌ను సీఎంగా బీజేపీ నియమించిందని బీఎస్పీ అధినేత మాయావతి చేసిన వ్యాఖ్యపై వెంకయ్య పై విధంగా స్పందించడం గమనార్హం.

సీఎం బంగళాలో ప్రత్యేక పూజలు


గోరఖ్‌పూర్, అలహాబాద్ నుంచి తరలివచ్చిన ఏడుగురు పూజారులు సోమవారం యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారిక బంగళాలో పూజలు చేశారు. యజ్ఞం తదితర పూజలు చేసే వరకూ బంగళాలో ప్రవేశించరాదని నిర్ణయించుకున్న ఆదిత్యనాథ్ శనివారం రాత్రి వీవీఐపీ అతిథి గృహంలో బస చేశారు.

పీఎంవో కనుసన్నల్లో యూపీ సర్కార్


యూపీలోని నూతన సర్కార్.. పీఎంవో కనుసన్నల్లో పని చేయనున్నది. అదే రాష్ట్ర క్యాడర్‌కు చెం దిన సీనియర్ ఐఏఎస్ అధికారి, పీఎంవో ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా రాష్ట్రఅధికార యంత్రాంగం పనితీరును, పాలనా వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఆదివారం సాయంత్రం యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తో నృపేంద్ర మిశ్రా సమావేశమయ్యారు. సీఎం ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ మధ్య ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తారు.

రాజ్యాంగ సవరణలకు ప్రైవేట్ బిల్లులు


18 ఏండ్లపాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన యూపీ నూతన సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో సభా వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పేరును హిందూస్థాన్‌గా మారుస్తూ రాజ్యాంగంలోని 1 అధికరణకు.. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా నిషేధం విధిస్తూ 25ఎ అధికరణాన్ని సవరించాలని బిల్లు తెచ్చారు.

3361

More News

మరిన్ని వార్తలు...