62 మంది మావోయిస్టులు లొంగుబాటు


Wed,November 7, 2018 02:07 AM

62 Maoists Surrender In Chhattisgarh

-ఛత్తీస్‌గఢ్‌లో జనజీవన స్రవంతిలోకి నక్సల్స్
-చాలా పెద్ద విజయమన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్
-మావోయిస్టుల హింస, బూటకపు సిద్దాంతాలు నచ్చకే లొంగిపోయారన్న పోలీసు అధికారులు

రాయ్‌పూర్/ న్యూఢిల్లీ/ కొత్తగూడెం క్రైం, నవంబర్ 6: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి మరో ఐదు రోజుల్లో తొలిదశ పోలింగ్ జరుగనుండగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు పెట్టనికోట వంటి బస్తర్ ప్రాంతంలో 62 మంది నక్సల్స్ మంగళవారం లొంగిపోయారు. ఇది చాలా పెద్ద విజయం అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 62 మంది నక్సల్స్‌లో 51 మంది బర్మార్ తుపాకులతో లొంగిపోయారని బస్తర్ రీజియన్ ఐజీ వివేకానంద సిన్హా మీడియాకు తెలిపారు. వీరంతా మావోయిస్టు కుతుల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చురుగ్గా పని చేస్తున్న కార్యకర్తలన్నారు. భారీస్థాయిలో నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలువడం తప్పనిసరిగా సానుకూల పరిణామం. ఇది మావోయిస్టులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఉనికిని కాపాడుకునేందుకు విధ్వంసాలకు పాల్పడుతూ, ప్రాణ, ఆస్తి నష్టాలకు దిగుతున్నారన్నారు. లొంగిపోయిన వారిలో కనీసం ఐదుగురు మావోయిస్టులు పలు నేరాలకు పాల్పడినట్లు అరెస్ట్ వారంట్లు ఉన్నాయని చెప్పారు.

90 స్థానాల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తొలిదశ కింద ఈ నెల 12న 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నియోజకవర్గాల్లో అత్యధికం బస్తర్ రీజియన్ పరిధిలోనివే. నక్సల్స్ లొంగుబాటు వార్త తెలియగానే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధాలు విడనాడి మావోయిస్టులు భారీ సంఖ్యలో పోలీసుల ముందు లొంగిపోయారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను, డీజీపీని, పోలీసు బలగాలను అభినందిస్తున్నా అని ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్స్ లొంగుబాటు కోసం సమర్థవంతంగా అమలు చేస్తున్న పునరావాస విధానానికి తాజా లొంగుబాట్లు స్పష్టమైన సంకేతం అని రాజ్‌నాథ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. లంగిపోయిన వారంతా మావోయిస్టు అనుబంధ ప్రజా సంఘాల్లో ఏడెనిమిదేండ్లుగా పని చేస్తున్నారన్నారు.

బంధించిన గ్రామస్థుడిని హతమార్చిన మావోయిస్టులు?

బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు తమ వద్ద బందీగా ఉన్న హేమ్లా అనే వ్యక్తిని హతమార్చినట్లు సమాచారం. అతడు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ సాయుధ నక్సల్స్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఆదివారం రాత్రి బడ్డేపార గ్రామం నుంచి హేమ్లా, సోను అనే వ్యక్తులను మావోయిస్టులు అపహరించుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజాపూర్ జిల్లా పరిధిలో కుశ్వాహ్ ట్రావెల్స్‌కు చెందిన యాత్రికుల బస్సుకు ఎనిమిది మంది నక్సల్స్ మంగళవారం నిప్పంటించారు. ఉసూర్ అనే ప్రాంతానికి వెళుతున్న బస్సును గమ్యస్థానానికి రెండు కి.మీ దూరంలో అడవిలో సాయుధ నక్సల్స్ నిలిపివేశారు. ప్రయాణికులందరిని దింపివేసి బస్సుకు నిప్పంటించారని జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసు అధికారులు, భద్రతాబలగాలు ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారన్నారు.

852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles