కష్టజీవులను కాటేసిన కల్తీ మద్యం

Sat,February 23, 2019 02:29 AM

-53 మంది మృతి; అసోంలో విషాదం.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

గువాహటి, ఫిబ్రవరి 22: వారంతా రోజువారీ కూలీలు.. రోజంతా తేయాకు తోటలో పనిచేసి అలసిపోయిన వాళ్లు కష్టాన్ని మరిచిపోవడానికి సాయంత్రం కాస్త మద్యాన్ని తాగారు. కానీ ఆ మద్యమే వారి పాలిట యమపాశంగా మారింది. కష్టజీవుల ప్రాణాలను కాటేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 53 మంది కల్తీ మద్యం తాగి మరణించారు. ఈ విషాద ఘటన అసోంలోని గోలాఘాట్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు.

సాల్‌మిరా తేయాకు తోటలో పనిచేసే వీరంతా గురువారం సాయంత్రం మద్యం తాగారు. అది కల్తీ మద్యం కావడంతో తాగిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గోలాఘాట్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మరో ముగ్గురు మరణించారు. చికిత్స పొందుతూ 38 మంది మృతిచెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో జోరాట్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరికొందరు గోలాఘాట్‌లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వీరంతా ఎక్కడైతే మద్యం కొనుగోలు చేశారో అక్కడే దాదాపు 100 మంది మద్యం తాగినట్లు తెలుస్తున్నది. దీని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరోవైపు కల్తీ మద్యాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీ యజమానులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం తయారీలో పాలుపంచుకున్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles