3.79 లక్షల ఉద్యోగాలు కల్పించాం


Mon,February 11, 2019 01:25 AM

3 79 lakh jobs have been provided

-అత్యధికంగా రైల్వే, పోలీసు, పన్నుల విభాగంలో ఉద్యోగాలు ఇచ్చాం
-ఇన్‌కంట్యాక్స్ ఫైలింగ్స్ పెరిగాయి..
-వాహనాల అమ్మకాల్లో వృద్ధి సాధించాం
-ఇటీవల మధ్యంతర బడ్జెట్‌లో గణాంకాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఉద్యోగ కల్పనలో కేంద్రప్రభుత్వం విఫలమైందని, దీంతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్ స్పందించింది. 2017-19 మధ్య 3.79 లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించామని ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 2017-18 మధ్య 2,51,279 ఉద్యోగాలను కల్పించామని చెప్పింది. ఈ సంఖ్య 1 మార్చి 2019 నాటికి 3,79,544కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని స్పష్టం చేసింది. దీన్నిబట్టి 1 మార్చి 2019 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 36,15,770కి చేరుకుంటుందని వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులు పెరుగడం, ఇన్‌కంట్యాక్స్ ఫైలింగ్స్ పెరుగడం, వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం, రవాణా, హోటల్స్, మౌలికసదుపాయాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగడం తదితర గణాంకాలను పరిశీలిస్తే భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తున్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రైల్వే, పోలీసు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విభాగంలో ఎక్కువగా ఉద్యోగాలను కల్పించామని తెలిపింది. రంగాల వారీగా పరిశీలిస్తే 1 మార్చి 2019 నాటికి రైల్వేలో 98,999 ఉద్యోగాలను కల్పించనున్నామని, పోలీసు డిపార్టుమెంట్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలకు అదనంగా 79,353 మందిని నియమించనున్నామని పేర్కొంది. అలాగే మార్చి 2017 నాటికి ప్రత్యక్ష పన్నుల విభాగంలో 50,208 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ సంఖ్య వచ్చే నెల నాటికి 80,143కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పౌర విమాన రంగంలో మార్చి 2017 నాటికి 1,174 మంది సిబ్బంది ఉన్నారని, ఈ సంఖ్య వచ్చే నెల నాటికి 2,363కు చేరుకుంటుందని పేర్కొంది. పోస్టల్ డిపార్టుమెంట్‌లోనూ 1 మార్చి 2019 నాటికి ఉద్యోగుల సంఖ్య 4,21,068కి చేరుకుంటుందని తెలిపింది.

rahul-gandhi

ఇది దివాళుకోరు ప్రభుత్వం

-ఉద్యోగాల కల్పనలో కాకి లెక్కలు చెబుతున్నది
-మోదీ సర్కార్‌పై రాహుల్ ధ్వజం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ విఫలమైందని, అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ ప్రభుత్వానిది నైతిక దివాళుకోరుతనం. అసమర్థత, అహంకారం రెండు కలిపితే దివాళుకోరుతనం బయటపడుతుందనడానికి ఆయన చెబుతున్న కాకి లెక్కలే ఉదాహరణ అని రాహుల్ ధ్వజమెత్తారు. ఒక డ్రైవర్ లక్షలు వెచ్చించి కారు కొనుక్కొని ఊబర్‌లో నడుపుకుంటుంటే అతడికి మోదీ ఉద్యోగం ఇచ్చినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఓలా, ఊబర్ 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని నీతిఆయోగ్ చెబుతున్నది. దీనిపై ఇటీవల ఓ మీడియా సంస్థ ఊబర్ డ్రైవర్‌ను ప్రశ్నిస్తే.. నేను లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వాహనం కొనుక్కున్నాను. నాకు మోదీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. దీన్నిబట్టి మోదీ సర్కార్ అబద్ధాలు చెబుతున్నదని అర్థమవుతున్నది అని రాహుల్ ఆదివారం ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles