కేరళపై జలఖడ్గం


Thu,August 16, 2018 12:45 PM

24 dams opened rains leave a trail of destruction

-కొనసాగుతున్న భారీ వర్షాలు
-సగం రాష్ట్రం వరద గుప్పిట్లోనే..
-పొంగిపొర్లుతున్న నదులు, వాగులు
-24 డ్యాంల గేట్లు ఎత్తివేత
-ఇడుక్కిలో రెడ్ అలర్ట్
-29కి చేరిన మృతులు.. నలుగురు గల్లంతు
-సహాయక చర్యల్లో సైన్యం, నౌకదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్
-అన్ని విధాలుగా అండగా ఉంటాం: రాజ్‌నాథ్ సింగ్

తిరువనంతపురం, ఆగస్టు 10: కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద ఉద్ధృతి పెరిగిపోతున్నది. సగం కేరళ వరద గుప్పిట్లో ఉన్నది. 11జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాదకరస్థాయి చేరుకోవడంతో డ్యాం ఐదు గేట్లను తెరచి నీటిని కిందకు వదలుతున్నారు. ఇడుక్కి దాని పరిసర ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఈ అలర్ట్ ఈ నెల 13 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. నీటి మట్టం పెరుగడంతో 24 డ్యాంల గేట్లను తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి, వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 29కి చేరుకుంది. నలుగురు గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 54వేల మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా 439 తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. నదుల్లో నీటి మట్టం పెరిగిపోతుండటం, వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సహాయక చర్యల్లో సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, స్థానిక అధికారులు పాల్గొంటున్నారు. మున్నార్‌లో రిసార్ట్‌లో చిక్కుకుపోయిన 57 మంది పర్యాటకులను సైన్యం కాపాడింది. వయనాడ్‌లో సహాయ కార్యక్రమాల్లో నౌకాదళ సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పంబా డ్యాం గేట్లను కూడా ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇడమలయార్ డ్యాంలోనూ నీటి మట్టం పెరిగిపోతున్నది. గత 24 గంటల్లో ఇడుక్కిలో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరద వల్ల కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో ఇడుక్కిలో భారీ సరుకు రవాణా లారీలను అనుమతించడం లేదు. తమ దేశానికి చెందిన పర్యాటకులు ప్రస్తుతం కేరళలో పర్యటించవద్దని అమెరికా సూచించింది. విమానాల రాకపోకలపై వర్షాల ప్రభావం లేదని కొచ్చి విమానాశ్రయ అధికారులు తెలిపారు.

రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన వరద: కన్నంథనమ్

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేరళకు చెందిన ఆల్ఫోన్స్ కన్నంథనమ్ వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేరళను ఆదుకోవడానికి కేంద్రం అన్ని విధాల సహాయాన్ని అందజేస్తుందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఆల్ఫోన్స్ విలేకరులతో మాట్లాడుతూ కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరద పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఏరియల్ సర్వే చేయనున్నారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆహారం, మందులను కర్ణాటక ప్రభుత్వం సరఫరా చేసింది. వరద ఉద్ధృతిపై కేరళ సీఎం పినరాయి విజయన్ క్యాబినెట్ మంత్రులు, అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
houses-submerged
ఈ నెల 12 వరకు అన్ని అధికారిక కార్యక్రమాలను సీఎం రద్దు చేసుకున్నారు. వర్షాల వల్ల ఘోరంగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని విజయన్ కోరారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం విజయన్‌కు ఫోన్ చేసి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు..

ఢిల్లీలోనూ వర్షం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోనూ శుక్రవారం భారీ వర్షం కురిసింది.దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలతో ప్రస్తుత సీజన్‌లో ఏడు రాష్ర్టాల్లో 718 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం ప్రకటించింది.

కేంద్రం జోక్యం చేసుకోవాలి ఎంపీ కవిత

కేరళలో వర్షాలు, వరదల వల్ల చనిపోయిన వారికి నిజామాబాద్ ఎంపీ కవిత సంతాపం తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కేరళ అతలాకుతలం అయ్యిందని, వెంటనే కేంద్రం సహాయక చర్యలను, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని ట్విట్టర్‌లో కోరారు.

853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles