కర్ణాటకం హంగామా!


Wed,May 16, 2018 08:20 AM

2018 Karnataka Assembly election results

-కర్ణాటకలో త్రిశంకు సభ..ఎవరికీ దక్కని మెజార్టీ
-ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎనిమిది సీట్లు కొరత
-ద్వితీయ స్థానంలో కాంగ్రెస్..దేవెగౌడతో సోనియా మంతనాలు
-జేడీఎస్‌కు బేషరతు మద్దతు
-ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలంతోకాంగ్రెస్-జేడీఎస్ కూటమి
-గవర్నర్ వజుభాయ్ కోర్టులో బంతి
-స్పష్టమైన తీర్పు ఇవ్వని కన్నడ ఓటరు.. సరికొత్త సమీకరణాలు
-బీజేపీ-104, కాంగ్రెస్-78, జనతాదళ్(ఎస్)-37
-ఉదయం నుంచీ ఉత్కంఠ.. గంటగంటకూ మారిన ఫలితం
-అతిపెద్ద పార్టీగా కమలం.. సాధారణ మెజారిటీకి మాత్రం దూరం
-వ్యూహం మార్చిన కాంగ్రెస్.. జేడీ(ఎస్)కు స్నేహహస్తం
-ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన బీజేపీ, జేడీ(ఎస్)-కాంగ్రెస్ కూటమి
-రాజ్‌భవన్‌కు చేరిన రాజకీయం.. గవర్నర్ నిర్ణయంపైనే అందరి దృష్టి

Election
అదే ఉత్కంఠ! ఎగ్జిట్‌పోల్స్‌లో వచ్చిన అంచనాలు.. ఓట్ల లెక్కింపు పూర్తై, ఫలితాలు విడుదలైన తర్వాత కూడా అదే అనిశ్చితి! కాంగ్రెస్‌ను దించాలా? లేక బీజేపీని గద్దెనెక్కించాలా? అన్న విషయంలో ఎటూతేల్చుకోని కన్నడ ఓటరు.. త్రిశంకు సభను నిర్దేశించాడు. వెరసి.. ఓట్ల శాతంలో అగ్రభాగాన ఉన్న కాంగ్రెస్.. మొదట్లో పోటాపోటీగా వచ్చినా.. చివరకు సీట్లపరంగా రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఓట్లు తక్కువే వచ్చినా.. సీట్లు ఎక్కువరావడంతో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. ఒక దశలో సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే స్థాయిలో ఆధిక్యం చూపినా.. గంటగంటకూ మారిన లెక్కలు.. బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకపోయినా.. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడంతోపాటు.. భవిష్యత్తు అవసరాలమేరకు పావులు కదిపిన కాంగ్రెస్.. కీలకనేతలను రంగంలోకి దింపి.. జేడీఎస్ అధినేత దేవెగౌడతో మంతనాలు నెరిపింది. మూడోస్థానంలో ఉన్న జేడీఎస్‌కు సంచలన రీతిలో బేషరతు మద్దతు ప్రకటించింది.

అప్పటిదాకా ఏదో ఒకటి చేసి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రకటనతో నిశ్చేష్టులయ్యాయి. కింగ్‌మేకర్ అవుతుందనుకున్న జేడీఎస్‌కాస్తా.. కాంగ్రెస్ మద్దతుతో కింగ్‌గా అవతరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది! అదిపెద్ద పార్టీ కనుక తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నాయకులు, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సరిపడా సభ్యులున్న కూటమిగా తమకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు గవర్నర్ వజూభాయ్ వాలాకు అర్జీ పెట్టుకున్నారు! కొన్ని నెలలక్రితం మణిపూర్, గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఏకైక పెద్ద పార్టీని కాదని, బీజేపీతో కూడిన పెద్ద కూటమిని ఆహ్వానించిన ఆ రాష్ట్ర గవర్నర్ల బాటలో వజుభాయ్ నడుస్తారా? లేక ఏకైక పెద్ద పార్టీ అయిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? బీజేపీకి అదృశ్యశక్తులేమైనా సహకరిస్తాయా? ఇప్పటికే మొదలైన రిసార్టు రాజకీయాలు.. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం మరికొద్ది గంటల్లో! ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీల బలం కర్ణాటక ఎన్నికలతో జాతీయ పార్టీలకు మరోసారి తెలిసివచ్చింది!
maxresdefault
బెంగళూరు, మే 15: ఊహించినట్లుగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్‌తో ముగిశాయి. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీ(ఎస్) 37 సీట్లను గెలుచుకున్నాయి. బీఎస్పీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థులు రెండు సెగ్మెంట్లలో గెలుపొందారు. ఫలితాల్లో అగ్రభాగాన నిలిచినప్పటికీ సాధారణ మెజారిటీ అయిన 112 సీట్లను సాధించడంలో బీజేపీ విఫలమైంది. ఈ నేపథ్యంలో రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ అనూహ్య ప్రకటనతో కన్నడ రాజకీయాల్ని మలుపుతిప్పింది. బీజేపీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా చేసేందుకు.. కేవలం 37సీట్ల గెలుచుకున్న జనతాదళ్ (సెక్యులర్)కు మద్దతిస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఓవైపు.. కాంగ్రెస్ మద్దతుతో జేడీ(ఎస్) మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని స్పష్టంచేశాయి. తమను ప్రభుత్వ ఏర్పాటుచేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ ఇరుపక్షాలూ గవర్నర్‌ను కలిశాయి. రెండునెలలుగా హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మంగళవారం ఫలితాలు వెలువడినప్పటికీ ఉత్కంఠ మాత్రం వైదొలగలేదు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్ణాటకలో 222 స్థానాలకు మే 12న ఎన్నికలు జరుగగా, మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఎవరికీ పూర్తి మెజారిటీ రాని స్థితిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయం నుంచీ సాగిన గొలుసుకట్టు పరిణామాలు చివరకు రాజ్‌భవన్‌కు వచ్చిచేరాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్ వాలా ఏ నిర్ణయం తీసుకుంటారనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఉదయం నుంచీ ఉత్కంఠే..

ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాలు ఎవరికీ పూర్తిస్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. ఉదయం కాంగ్రెస్, బీజేపీ చెరి సమానంగా ఉన్న దశనుంచీ గంట గంటకూ మారిన ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీరణాలను పూర్తిగా మార్చేస్తూ వచ్చాయి. కొత్త పొత్తులను తెరపైకి తెచ్చాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటలకు బీజేపీ 98స్థానాల్లో, కాంగ్రెస్ 91 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. మరోగంట తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే బీజేపీ ముందుకు దూసుకెళ్లింది. బీజేపీ 105 స్థానాల్లో లీడ్‌లోకి రాగా, కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) వెనుకబడిపోయాయి. కౌంటింగ్ మధ్యలోకి వచ్చేసరికి, కాంగ్రెస్ 70 సీట్లకు పుంజుకుంది. జేడీ(ఎస్)కూడా కొంత మెరుగుపడి 40 స్థానాలకు దగ్గరగా వచ్చింది. అక్కడినుంచి బీజేపీ 118 స్థానాల నుంచి క్రమంగా కిందకు దిగివస్తున్నట్లు పోలింగ్‌సరళి స్పష్టంచేసింది. చివరకు మ్యాజిక్ సంఖ్యకు 8 సీట్ల దూరంలో 104 స్థానాలకు బీజేపీ పరిమితమైంది. కాంగ్రెస్ 78 సీట్లను సాధించగా, జేడీ(ఎస్) 37సీట్లు గెలుచుకున్నాయి. విచిత్రంగా రెండోస్థానానికి పరిమితమైన కాంగ్రెస్.. ఓట్లశాతంలో మాత్రం అందరికన్నా ముందు నిలిచింది. కాంగ్రెస్ 37.9శాతం ఓట్లు సాధించగా, బీజేపీ 36.2శాతం గెలుచుకుంది. ఇక 18.4శాతం జేడీ(ఎస్) సాధించింది. 2013 ఎన్నికల ఫలితాలతో పోల్చితే కాంగ్రెస్ సీట్లు గణనీయంగా తగ్గగా, బీజేపీ భారీగా పుంజుకుంది. జేడీ(ఎస్) ఓట్లు, సీట్లలో పెద్దగా మార్పేమీ రాలేదు.
Election1

జేడీ(ఎస్)కు కాంగ్రెస్ బేషరతు మద్దతు

ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఏకంగా సీఎం పదవిని జేడీ (ఎస్)కు ఇచ్చేందుకు సిద్ధపడిం ది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జేడీ (ఎస్) అధినేత దేవెగౌడకు ఫోన్‌చేసి మాట్లాడారు. కుమారస్వామికి సీఎం పదవిని అప్పగించేందుకు సిద్ధమని ఆమె స్పష్టంచేశారు. దేవెగౌడ నివాసంలో జేడీ(ఎస్) నేతలు సమావేశమై మూడుగంటలపాటు చర్చించారు. అనంతరం కాంగ్రెస్ ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు జేడీ(ఎస్) ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను అహ్మద్‌పటేల్, గులాంనబీ ఆజాద్‌లకు కాంగ్రెస్ అప్పగించింది. హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ అవుతాడనుకున్న కుమారస్వామికి.. ఇప్పుడు ఏకంగా కింగ్ అయ్యే అవకాశమే దక్కింది. జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే, తాము మద్దతిస్తామని కాంగ్రెస్ నేతలు సిద్దరామయ్య, గులాంనబీ ఆజాద్ మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతుందా? బయటినుంచి మద్దతిస్తుందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

దేవెగౌడపై పనిచేసిన సెక్యులర్ ఒత్తిళ్లు

జేడీ(ఎస్)ను కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసేందుకు దేవెగౌడపై పలు పక్షాల నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తున్నది. బీజేపీతో చేతులు కలుపవద్దని, లౌకిక శక్తులే అధికారంలోకి వచ్చేలా చూడాలని వారు దేవెగౌడకు సూచించినట్లు సమాచారం. బీజేపీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. నా పార్టీని ముక్కలు చేసేందుకు కూడా వారు ప్రయత్నించవచ్చు. అయినప్పటికీ లౌకిక కూటమి నుంచి నేను తప్పుకోలేను అని దేవెగౌడ వారికి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Election2

గవర్నర్‌ను కలిసిన జేడీ(ఎస్)-కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జేడీ(ఎస్) ఇదేవిషయాన్ని గవర్నర్‌కు తెలిపింది. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, అశోక్ గెహ్లాట్, జేడీఎస్ నేత కుమారస్వామి గవర్నర్ వజూభాయ్ వాలాను మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జేడీ(ఎస్)కు బేషరతుగా కాంగ్రెస్ మద్దతిస్తున్న విషయాన్ని గవర్నర్‌కు స్పష్టంచేశాం. సంబంధిత తీర్మానాలను కూడా సమర్పించాం అని మాజీ సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఏ విషయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తానని గవర్నర్ తెలిపినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత, ఎన్నికల కమిషన్ ఇచ్చే సమాచారం ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ నేతలకు చెప్పినట్లు సమాచారం.

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరిన బీజేపీ

అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ కోరింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ కేంద్రమంత్రి అనంతకుమార్ తదితరులు ఈ మేరకు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మేం ఎక్కువ సీట్లను సాధించినందున ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకువచ్చాం. అసెంబ్లీ విశ్వాసాన్ని నిరూపించుకునే అవకాశాన్ని మాకివ్వండి అని గవర్నర్‌ను కోరినట్టు యడ్యూరప్ప తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కోసీటు కీలకమైన ప్రస్తుత తరుణంలో ఇద్దరు స్వతంత్రుల మద్దతు పార్టీలకు అత్యవసరంగా మారింది. వారితో ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు బేరసారాలు ప్రారంభించాయని వినికిడి.
Election3

2644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles