బాల కార్మిక భారతం!


Thu,July 12, 2018 01:51 AM

2 3 crore children in the age group of 15 18 years are child laborers

-15-18 ఏండ్ల వయసు పిల్లల్లో 2.3 కోట్ల మంది బాలకార్మికులే!
-మధ్యలో బడి మానేసినవారు 1.9 కోట్ల మంది
-15-19 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకుంటున్నవారు 92 లక్షలు
-చైల్డ్ రైట్స్ అండ్ యూ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో 15-18 ఏండ్ల వయసు కలిగిన 2.3 కోట్ల మందికిపైగా బాలలు వివిధ పనుల్లో నిమగ్నమవుతున్నారని చిల్డ్రన్ రైట్స్ అండ్ యు (సీఆర్‌వై) అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. వీరిలో చదువుకు, పనికి సమయం సరిపోక 1.9 కోట్ల మంది మధ్యలో బడిమానేశారని ఆ నివేదిక పేర్కొన్నది. దేశంలో 15-18 ఏండ్ల వయసు కలిగిన పిల్లల స్థితిగతులపై చట్టసభల సభ్యులకు, విధాన నిర్ణేతలకు స్పష్టం గా అవగతం కావాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థ వారికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం 15-19 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకుంటున్నవారు 92 లక్షల మంది ఉండగా, ఇదే వయసులో 24 లక్షల మంది బాలికలు తల్లులు అవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 15-18 ఏండ్ల వయస్సు కల బాల లు 10 కోట్ల మంది కాగా, అందులో దాదాపు 23 శాతం మం ది బాలకార్మికులుగా ఉండటం గమనార్హం. 15-18 ఏండ్ల మధ్య వయసు కలిగిన పిల్లలు ప్రమాదకరం కాని పనులు చేసేందుకు బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం అనుమతిస్తుండటంతో 2.3 కోట్ల మంది బాల కార్మికులుగా మారిపోయారు.

వీరంతా చట్టబద్ధంగా బాలకార్మికులుగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చదువు, పని రెండింటినీ ఒకేసారి చేయలేకపోవడం, వివిధ ఇతర కారణాలతో 1.9 కోట్ల మంది మధ్యలోనే బడి (డ్రాప్‌అవుట్) మానేశారు. భారీగా ఉన్న డ్రాప్ అవుట్ రేటును తగ్గించడానికి రైట్ ఆఫ్ చిల్డ్రెన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టానికి సవరణలు చేయాలని సీఆర్‌వై సూచించింది. ఉన్నత, మాధ్యమిక స్థాయిల్లో ఉచిత విద్యాబోధనకు ఈ చట్టాన్ని ప్రత్యామ్నాయం గా చూపరాదన్నది. పాఠశాల విద్యా వ్యవస్థలో లింగ సమానత్వం తేవాల్సిన అవసరం ఉన్నదని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని పిల్లలకు సెకండరీ విద్యను ఉచితంగా అందించాలన్నది. కిడ్నాప్ బాధితుల్లో 60 శాతం మంది, లైంగిక వేధింపుల బాధితుల్లో 25 శాతం మంది 15-18 ఏండ్ల వయసువారేనని నివేదిక చెప్తున్నది. చిన్నారులపై నేరాలను తగ్గించేందుకు పేదరికం, నిరుద్యోగిత వంటి సమస్యల మూలాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని సీఆర్‌వై సూచించింది. 2011 జనాభా గణాంకాలు, 2015-16 నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 2016 వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

సమాజం మద్దతుతోనే బాలల సమస్యలకు పరిష్కారం

15-18 మధ్య వయసు కలిగిన బాలల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు సమాజం మద్దతు ఉండాలని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ స్తుతి కేకర్ తెలిపారు. ఒక చిన్నారి బాధను సమాజం తన బాధగా భావించినప్పుడే భావి పౌరుల స్థితిగతులు మెరుగుపడుతాయని తెలిపారు. విధాన నిర్ణేతలు పాలసీలు రూపొందించే క్రమంలో బాలల సమస్యలను తెలుసుకునేందుకు వారితో మాట్లాడాలని.. వారి ఆందోళనలు, బాధలను అర్థంచేసుకోవాలని సూచించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రియా నందా మాట్లాడుతూ 15-18 మధ్య వయసు కలిగిన బాలలకు సంబంధించిన పథకాల్లో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలని, వాటిని బలపర్చాలని కోరారు. ఈ వయసు బాలలకు ప్రేరణ కల్పించేందుకు పాఠశాలలను ఉపయోగించుకోవాలని.. తద్వారా డ్రాప్ అవుట్లు తగ్గుతాయని తెలిపారు.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles