వారణాసిలో కూలిన ైఫ్లెఓవర్Wed,May 16, 2018 02:07 AM

-18 మంది మృతి.. పలువురికి గాయాలు
-మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
-దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీ
-ఉపరాష్ట్రపతి, ప్రధాని, యూపీ గవర్నర్ సంతాపం
Varanasi
వారణాసి/ లక్నో, మే 15: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగర పరిధిలో రైల్వే స్టేషన్ సమీపాన నిర్మాణంలో ఉన్న ైఫ్లెఓవర్‌లో ఒక భారీ కాంక్రీట్ దిమ్మె మంగళవారం సాయంత్రం కూలిపోయింది. దాని కింద చిక్కుకున్న సిటీ బస్సు, ఐదు కార్లు, రెండు ఆటో రిక్షాలు, పలు మోటారు సైకిళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారంతా శిథిలాల కింద నలిగిపోయారు. ఇప్పటివరకు జాతీయ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) సిబ్బంది 18 మృతదేహాలను వెలికి తీశారు. పలువురిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. ైఫ్లెఓవర్ కుప్పకూలడానికి కారణాలపై దర్యాప్తునకు ముగ్గురు అధికారులతో కమిటీని వేశారు. ఘటనా స్థలం వద్దకు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం సంగతి తెలియగానే అధికార యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకున్నది. భారీగా క్రేన్లను తరలించి సహాయ చర్యలు చేపట్టింది. తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులను రంగంలోకి దించారు.

క్షతగాత్రులను కంటోన్మెంట్, జిల్లా కేంద్ర దవాఖానలకు తరలించారు. ైఫ్లెఓవర్ కుప్పకూలడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కొందరు క్షతగాత్రులను క్యాన్సర్ దవాఖానకు తరలించినా.. అక్కడ చికిత్స చేసేందుకు అవసరమైన పరికరాల్లేకపోవడంతో బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) విద్యార్థులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బీహెచ్‌యూ ట్రామా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనలో మృతులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ రాంలాల్ సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ ఇది దేశంలోకెల్లా ప్రథమ ప్రాధాన్యం గల లోక్‌సభ స్థానం పరిధిలో సాగుతున్న అభివృద్ధికి వాస్తవ రూపం అని ఆరోపించారు. నిత్యం రాష్ట్ర మంత్రులు సందర్శించే వారణాసిలో జరిగిన ఈ ప్రమాదం ప్రభుత్వ అవినీతికి నిదర్శనమా? అని ప్రశ్నించారు. దీనిపై నిజాయితీగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

820

More News

VIRAL NEWS