లోయలో పడిన బస్సుMon,July 17, 2017 02:34 AM

-అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం
-17 మంది దుర్మరణం

Amarnathyaatra
శ్రీనగర్/న్యూఢిల్లీ, జూలై 16: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని మరువకముందే మరో విషాదం చోటు చేసుకుంది. రాంబాన్ జిల్లాలోని నచ్లానా వద్ద శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారిపై యాత్రికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 17మంది మృతిచెందారు. మరో 29మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 19మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వైమానికదళ హెలికాప్టర్లలో జమ్ములోని దవాఖానలకు తరలించారు. బస్సు అమర్‌నాథ్ యాత్రకు వస్తున్నట్లు ఎలాంటి బోర్డూ పెట్టుకోలేదు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

3603మందితో కూడిన 17వ యాత్రికుల బృందం ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య జమ్ము నుంచి అమర్‌నాథ్‌కు బయల్దేరింది. దాంట్లో ప్రమాదానికి గురైన జమ్ముకశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు కూడా ఉంది. అందులో 43 ప్రయాణికులు ఉన్నారని, వీరంతా యూపీ, బీహార్, రాజస్థాన్, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందినవారని రాంబాన్ జిల్లా సీనియర్ ఎస్పీ మోహన్‌లాల్ తెలిపారు. బాల్తాల్-పెహల్‌గావ్ బేస్‌క్యాంపులను చేరకముందే బస్సు నచ్లానా సమీపంలో ఇరుకుదారిపై ఒక్కసారిగా బోల్తాపడిందని, పక్కనే ఉన్న లోయలోకి దొర్లుకుంటూ పడిపోయిందని ఆయన చెప్పారు. కాగా, ప్రమాదంపై జమ్ముకశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విచారణకు ఆదేశించింది.
జూలై 10వ తేదీన అనంత్‌నాగ్ జిల్లాలోనే అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని జమ్ముకశ్మీర్‌లో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ యాత్రికుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. బృందాలు బృందాలుగా అమర్‌నాథ్‌కు తరలివెళ్తూనే ఉన్నారు.
Busvalley

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని


బస్సు ప్రమాదంలో మృతిచెందిన అమర్‌నాథ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండులక్షల రూపాయల చొప్పున, గాయపడినవారికి 50వేల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన మోదీ యాత్రికుల మృతి అత్యంత బాధాకరమని ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తంచేశారు. బస్సు ప్రమాద మృతులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

సీఎం, గవర్నర్‌తో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి


మరోవైపు అమర్‌నాథ్ బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో, గవర్నర్ ఎన్‌ఎన్ వోరాతో ఫోన్లో మాట్లాడారు. బస్సు ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై జమ్ముకశ్మీర్ సీఎం, గవర్నర్‌తో మాట్లాడాను. సహాయచర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. క్షతగాత్రులను జమ్ముకు తరలించి చికిత్స అందించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించాం అని రాజ్‌నాథ్ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే నా గుండె ఆగినంతపనైంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రభుత్వం రాంబాన్ ప్రమాదంపై రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. 091-2560401, 0191-2542000 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నది.
BUS

ఉగ్రదాడిలో గాయపడిన మహిళ మృతి


జూలై10న ఉగ్రవాదుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ ఆదివారం మృతిచెందారు. శ్రీనగర్‌లోని ఎస్‌కేఐఎంఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్న లలిత(47) ఆదివారం చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఉగ్రదాడిలో మృతిచెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది.

కొండచరియలు విరిగిపడటంతో నిలిచిన రాకపోకలు


వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కశ్మీర్‌లోయను మిగతా ప్రపంచానికి కలిపే ఈ రహదారిపై రాంబాన్ జిల్లాలోని సేరి, మరూగ్, ఖూనీనల్లా ప్రాంతాల్లో ఆదివారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. అమర్‌నాథ్‌కు యాత్రికులను రాంబాన్, చందర్‌కోట్ ప్రాంతాల్లోనే నిలిపివేశారు. నాలుగైదు గంటలపాటు శ్రమించిన సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) విరిగిపడిన కొండ చరియలను తొలగించడంతో మార్గం సుగమమైంది.

భారీ బందోబస్తు మధ్య బయల్దేరిన 17వ బృందం


3888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌లో జ్యోతిర్లింగ దర్శనానికి 3603మందితో కూడిన యాత్రికుల 17వ బృందం ఆదివారం ఉదయం జమ్ము నుంచి బయల్దేరింది. జూన్ 28న యాత్ర మొదలైన తర్వాత ఒక్క జమ్ము నుంచే 53,631మంది యాత్రికులు అమర్‌నాథ్‌కు బయల్దేరారు. ఆగస్టు 7న శ్రావణ పూర్ణిమతో ముగియనున్న అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 1,95,491మంది యాత్రికులు అమరలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. 35వేల నుంచి 40వేలమంది పోలీసులను, బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది యాత్రికుల రక్షణ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఉగ్రదాడి, బస్సు ప్రమాదం ఘటనలు కాకుండా.. సాధారణ యాత్రికుల్లో ఇప్పటివరకు 19మంది వివిధ కారణాలతో మృతిచెందారు. మహారాష్ట్రకు చెందిన సదాశివ్ (65) అస్వస్థతకు గురై బాల్తాల్ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం కన్నుమూశారు.

939

More News

VIRAL NEWS