వీరులకు పురస్కారాలు


Wed,March 20, 2019 04:01 AM

14 yr old Irfan has given the President the Shaurya Chakra the story of his courage

-ఇద్దరు అమర జవాన్లకు కీర్తిచక్ర అవార్డులు
-శౌర్యచక్ర అవార్డు గ్రహీతల్లో కశ్మీరీ యువకుడు

న్యూఢిల్లీ, మార్చి 19: దేశానికి ఎనలేని సేవలందించిన సాయుధ బలగాల సిబ్బందికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం సాహస అవార్డులను ప్రదానం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఇద్దరు సైనికులను కీర్తిచక్ర అవార్డులతో గౌరవించిన రాష్ట్రపతి.. మరో ఇద్దరు అమర జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను ప్రదానం చేశారు. జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో సైనిక విధులు నిర్వర్తిస్తూ అమరులైన ఈ నలుగురు జవాన్లకు మరణానంతరం ఈ పురస్కారాలు లభించాయి. అయితే సాధారణంగా సాయుధ బలగాల సిబ్బందికి మాత్రమే ప్రదానంచేసే శౌర్య చక్ర అవార్డు ఈసారి అసాధారణ రీతిలో జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ రంజాన్ షేక్ అనే 16 ఏండ్ల యువకుడిని కూడా వరించడం విశేషం. రెండేండ్ల క్రితం తన ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడినందుకు ఇర్ఫాన్‌ను శౌర్యచక్ర అవార్డుతో సత్కరించిన రాష్ట్రపతి.. ఆర్మర్డ్ కార్ప్స్‌కు చెందిన సోవర్ విజయ్ కుమార్‌తోపాటు సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) కానిస్టేబుల్ ప్రదీప్‌కుమార్ పాండాకు కీర్తిచక్ర అవార్డులను ప్రదానం చేశారు. వీరిద్దరు జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయారు.

మణిపూర్, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో విశిష్టమైన పాత్ర పోషించిన రైఫిల్‌మన్ జైప్రకాశ్ ఒరావోన్, సిపాయి అజయ్ కుమార్‌కు మరణానంతరం శౌర్యచక్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి.. జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రల్లో సైనిక విధులు నిర్వర్తించడంలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ కుల్దీప్ సింగ్ చహర్, మేజర్ పవన్‌కుమార్, రైఫిల్‌మన్ రత్వ లీలేశ్ భాయ్ తదితరులకు కూడా శౌర్యచక్ర అవార్డులను బహూకరించారు. అలాగే త్రివిధ దళాలకు చెందిన 13 మంది సీనియర్ అధికారులకు పరమ విశిష్ట సేవా పతకాలను, 26 మంది అధికారులకు అతి విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి.. లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌కుమార్ భట్ సహా ఇద్దరు సైనికాధికారులకు ఉత్తమ యుద్ధ సేవా పతకాలను బహూకరించారు. ప్రస్తుతం డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)గా పనిచేస్తున్న అనిల్‌కుమార్ భట్.. కశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వర్తించే 15 కార్ప్స్‌కు జీవోసీ (జనరల్ ఆఫీసర్ కమాండింగ్)గా కూడా వ్యవహరిస్తున్నారు.

14 ఏండ్ల చిరు ప్రాయంలోనే.. ఉగ్రవాదులకు చుక్కలు చూపిన ఇర్ఫాన్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం శౌర్యచక్ర అవార్డును అందుకున్న జమ్ముకశ్మీర్ యువకుడు ఇర్ఫాన్ రంజాన్ షేక్.. రెండేండ్ల క్రితం తన ఇంటిపై దాడికి యత్నించిన సాయుధ ఉగ్రవాదులను తరిమికొట్టాడు. అప్పుడు ఇర్ఫాన్ వయసు కేవలం 14 ఏండ్లే. వివరాల్లోకెళ్తే.. ఇర్ఫాన్ తండ్రి రంజాన్ షేక్‌ను హత్య చేసేందుకు 2017 అక్టోబర్ 16వ తేదీన ముగ్గురు ఉగ్రవాదులు ఇర్ఫాన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిన ఇర్ఫాన్ ఆ ఉగ్రవాదులను ఇంటి వెలుపలే అడ్డుకున్నాడు. ముప్పును ఏమాత్రం ఖాతరు చేయకుడా ఆ ముగ్గురు ఉగ్రవాదులతో ఇర్ఫాన్ వీరోచితంగా పోరాడాడు. ఈ పోరాటంలో ఓ ఉగ్రవాదిని హతమార్చిన ఇర్ఫాన్.. మిగిలిన ఇద్దరు ముష్కరులను అక్కడి నుంచి తరిమికొట్టాడు. ఉగ్రవాదుల దాడిలో ఇర్ఫాన్ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఇర్ఫాన్ భవిష్యత్తులో ఐపీఎస్ అధికారిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాడు.

544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles