మహారాష్ట్రలో రైతు గోస

Mon,November 11, 2019 02:33 AM

- 2016లో అన్నదాతల ఆత్మహత్యలు అక్కడే అత్యధికం
- ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్‌
- దేశవ్యాప్తంగా 11,379 మంది రైతులు బలవన్మరణం
- ఎన్సీఆర్బీ నివేదిక విడుదల

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో అత్యధికం. ఆ రాష్ట్రం తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. జాతీయ నేర నివేదికల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2016 ఏడాదికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం 2016లో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 11,379 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 6,270 మంది రైతులు కాగా 5,109 మంది వ్యవసాయ కూలీలు. బలవన్మరణం చెందిన వారిలో 275 మంది మహిళా రైతులు, 633 మంది మహిళా వ్యవసాయ కూలీలున్నారు. 2016లో దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యలు 1,31,008 కాగా ఇందులో 8.7 శాతం రైతు సంబంధ కేసులేనని భారత్‌లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు (ఎడీఎస్‌ఐ) 2016 నివేదిక వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 84 శాతం మంది సొంతంగా వ్యవసాయం చేస్తున్నవారు కాగా మిగతా వారు కౌలు రైతులు. మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో తీవ్ర కరవు నెలకొనడంతో 3661 మంది రైతులు, కూలీల ఆత్మహత్యలతో ఆ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. 2,079 మంది ఆత్మహత్యలతో రెండోస్థానంలో కర్ణాటక, 1,321 కేసులతో మూడోస్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచాయి.

పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, నాగాలాండ్‌ రాష్ర్టాలతోపాటు చండీగఢ్‌, దాద్రా అండ్‌ నగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో రైతు ఆత్మహత్య కేసులు నమోదు కాలేదు. మరోవైపు 2015తో పోల్చితే 2016లో రైతుల ఆత్మహత్యలు కాస్త తగ్గాయని నివేదిక పేర్కొంది. 2015లో 12,602 కేసులు నమోదయ్యాయని, ఇందులో 8,007 రైతుల ఆత్మహత్యలవి కాగా 4,595 వ్యవసాయ కూలీలకు సంబంధించివని తెలిపింది. మొత్తం బలవన్మరణాలు కూడా 2015 కంటే 2016లో కాస్త తగ్గినట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 2015లో 1,33,623 ఆత్మహత్యలు నమోదు కాగా 2016లో 1,31,008 నమోదయ్యాయి. సూసైడ్‌ రేటు కూడా 2015లో 10.6 శాతం ఉంటే 2016లో అది 10.3 శాతానికి తగ్గింది. మొత్తంగా చూస్తే ఎక్కువ మంది కుటుంబ కలహాలు (29.3 శాతం), అనారోగ్యం (17.1 శాతం) కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. 2016లో నమోదైన మొత్తం సూసైడ్‌ కేసుల్లో వీరిది 46.3 శాతమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles