75 ఏండ్లు కలిసి నడిచారు..గంటలోనే వెళ్లిపోయారు

Thu,November 14, 2019 01:55 AM

-104 ఏండ్ల భర్త చనిపోయిన గంటలోపే వందేండ్ల వయస్సున్న భార్య మృతి
-తమిళనాడులోని పుదుక్కొైట్టె జిల్లాలో ఘటన

పుదుక్కొైట్టె: వారు శతాధిక వృద్ధ దంపతులు. వారి 75 ఏండ్ల వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని విధంగా వారి బంధం పెనవేసుకున్నది. ఈ నేపథ్యంలో గుండెపోటుతో భర్త చనిపోయిన గంట వ్యవధిలోనే భార్య కూడా కన్నుమూసింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుక్కొైట్టె జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. 75 ఏండ్ల క్రితం వెట్రివేల్, పిచాయి పెండ్లి జరిగింది. వెట్రివేల్ వయసు 104 ఏండ్లుకాగా, పిచాయ్ వయసు 100 ఏండ్లు. వీరు అలంగుడి తాలుకాలోని కుప్పక్కుడి ద్రావిడర్ కాలనీలో నివాసముంటున్నారు. నూరేండ్లు నిండినప్పటికీ దంపతులిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు.

అయితే, సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతినొప్పి రావడంతో మనుమలు ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు వెట్రివేల్ మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. విగతజీవిగా మారిన భర్త భౌతికకాయాన్ని చూసిన భార్య పిచాయి గుండెలవిసేలా రోదించి ఒక్కసారిగా కూలబడింది. డాక్టర్ వచ్చి ఆమెను పరిక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. గంట వ్యవధిలోనే ఆ వృద్ధ దంపతులిద్దరూ కన్నుమూయడంతో వారికుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

4021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles