సర్వం శివోహం

ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో భక్తి పారవశ్యంలో తరించే పర్వదినం మహాశివరాత్రి. ఆ పర్వదినాన ప్రపంచంలోని శైవ దేవాలయల ప్రత్యేకతల పై కథనం.

లింగోద్భవం - శివరాత్రి చరిత్ర

- రాజ్ కుమార్ తలారి
ఒక నాడు బ్రహ్మ, విష్ణువులకి తమలో ఎవరు గొప్ప అనే విషయం పై వాదనవచ్చింది. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడనని బ్రహ్మ, నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు అంటాడు విష్ణువు. యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యు ద్ధాన్ని ఆరంభిస్తారు. విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒక రు సంధించుకొంటారు. అప్పటివరకు వీరి యుద్ధాన్ని చూస్తున్న దేవతలు భయంతో ఆ మహాదేవుని దగ్గరకి వెళ్లి శరణు వేడగా శివుడు అగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించి ఆ అస్త్రాలను తనలో లయం చేసుకుంటాడు. అప్పుడు ఆ మహా శివుడు జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు.(శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటారు.) నా ఆది, అంతం ఎవరు కనుక్కుం టారో వారే గొప్ప అని చెప్తాడు శివుడు .

విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు కిందకు దిగుతూ, ఒక మొగలి పువ్వు కింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసిన బ్రహ్మ నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండంటూ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇక తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. దానికి మొగలి పువ్వు అవునని, కామ ధేనువు నిజమేనంటూ తల ఊపుతూ, కాదు అన్నట్టు తోక అడ్డంగా ఊపుతుంది.

శివునకు ఒక రూపమంటూ ఉండదు. భక్తులను అనుగ్రహించే క్రమంలో ఆయన వివిధ రూపాల్లో కన్పిస్తాడు. ఆ రూపాలే లీలా రూపాలు.

...
శివుడు విష్ణువు సత్య వాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణు వు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వ దిస్తాడు. సర్వాంతర్యామి అయిన శివుడు కోపోద్రేకుడై బ్రహ్మని, మొగలి పువ్వును, కామ ధేనువును శపిస్తాడు. బ్రహ్మ యొక్క ఐదుతలలోంచి అబద్ధం చెప్పిన తలను నరికివేయమని తన కనుబొమ్మల్లోంచి భైరవుడిని సృష్టించి ఆజ్ఞాపిస్తాడు. శివాజ్ఞను శిరసా వహించిన భైరవుడు బ్రహ్మ యొక్క తలను నరికివేస్తాడు. పూజకు నిన్ను ఉపయోగించరు అంటూ మొగలి పువ్వును, పూజలుండవంటూ కామధేనువుని శపిస్తాడు. తిరిగి వీరు ముగ్గురూ శరణు వేడగా బోళా శంకరుడు శాంతించి మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ వెనక భాగము పునీతమై, పూజలనందుకొనును అంటూ వరమిచ్చాడు. అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉందువంటూ చెబుతాడు.అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును అని వరమిచ్చెను.
మాఘమాసం 14వ రోజున శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించినందున శివరాత్రిగా జరుపుకుంటారని కొందరు, ఆ రోజునే క్షీరసాగర మథనం జరిగి శివుడు గరళాన్ని తన గొంతులో దాచుకున్నాడని మరికొందరు అంటారు. పార్వతీ పరమేశ్వరుల పెళ్లిరోజుగానూ శివరాత్రిని జరుపుకుంటారని, గంగ దివినుండి భువికి వచ్చింది కూడా ఈ రోజే అని ఇలా రకరకాల కథనాలున్నాయి. ఏదేమైనా, మహా శివరాత్రి రోజు శివుడికి ప్రీతిపాత్రమైంది కనుక జాగారం చేసి అత్యంత నిష్టతో, ఉపవాసాలతో ప్రజలు శివున్ని పూజిస్తారు.

కైలాస పర్వతం

- మధుకర్ వైద్యుల

కైలాస పర్వతం ఏటవాలు భాగం కల్పవృక్షం విస్తరించిన రీతిలో కనిపిస్తుంది. పర్వతం దక్షిణభాగం నీలమణి, తూర్పుభాగం స్ఫటికం, పశ్చిమభాగం కెంపు, ఉత్తరభాగం స్వర్ణంగా పిలుస్తుంటారు.

...

సముద్రమట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరమిది. చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస మహాపర్వతం పైన సాక్షాత్తు శివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే జీవితంలో ఒక్కసారన్నా కైలాస పర్వతాన్ని సందర్శించి తరించాలని తపించే వారెందరో! కైలాస పర్వతశ్రేణుల్లోకి అడుగు పెడితే చాలు, మనల్ని మనం మరిచిపోయి దైవ చింతనలో లీనమై పోతాం. ఇంతటి పవిత్రత గల ఈ ప్రాంతం నిత్యం వేలాదిమందితో అలరారుతుంటుంది. మహర్షులు, ఋషులు, స్వామిజీలతో పాటు సామాన్యులు సైతం ధ్యానముద్రలో ఇక్కడి పవిత్ర వాతావరణంతో మమేకమైపోతారు. నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. కైలాస పర్వతం స్వయంభు. అంటే దానికదే అవతరించిందని. నిజానికి కైలాస పర్వతం, దీనికి సమీపంలోనే ఉండే మంచినీటి సరస్సు ఐన మానస సరోవరం సృష్టికంటే కూడా పురాతనమైనవని హైందవ పండితులు చెబుతుంటారు. మానస సరోవరంలోని నీరు తాగితే మరణానంతరం నేరుగా కైలాసానికి చేరవచ్చని, స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అతి శీతలమైన ఈ సరస్సు చలికాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే వేసవి, మిగతా ఋతువుల కాలంలో మాత్రమే ఇక్కడికి వస్తుంటారు.

హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉందని విశ్వసిస్తారు. మహావిష్ణువు కాలి బొటనవేలి నుంచి ఉద్భవించిన గంగానది చాంద్రమాన వృత్తంలో ప్రవేశించి అనంతరం కైలాస పర్వత శిఖరం నుంచి భూమికి వచ్చిందని, గంగానది ఉధృతిని నియంత్రించేందుకు మహాశివుడు ఆమెను తన జటాజూటంలోకి ఇక్కడే స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. బౌద్ధులూ ఈ ప్రాంతాన్ని అత్యంత పుణ్యస్థలంగా భావిస్తారు. శిఖరంపైన ఉన్న బుద్ధుడు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంటాడు. దీన్ని ధర్మపాలగా వారు పిలుస్తారు.

విదేశాల్లో కొలువైన శైవక్షేత్రాల్లో మరో ప్రముఖ క్షేత్రం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయం.

పశుపతినాథ ఆలయం

...
హిమాలయాల్లో కొలువైన ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. శివుడి తత్వాన్ని బోధించే ఈ క్షేత్రం కాశీ క్షేత్రమంత పవిత్రమైందని అంటారు. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలువబడుతున్నాడు. ఈ దేవాలయం తూర్పు ఖాట్మండులోని భాగమతి నదీ తీరాన కొలువై ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారనడానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని శాసనాల ప్రకారం క్రీస్తుశకం 753లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11వ జయదేవ ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. క్రీస్తుశకం 1416లో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడనీ అంటారు. క్రీస్తుశకం 1697లో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని తెలుస్తోంది.

ఈ పశుపతినాథున్ని ఆదిశంకరుడు కొలిచాడంటారు. మనిషిలోని పశుత్వాన్ని జయించి మోక్షమార్గం వైపు పయనించాలంటే పశుపతినాథున్ని తప్పక పూజించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

దీని నిర్మాణం ప్రత్యేక శైలిలో వుంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారాలతో తాపడం చేసి ఉంటాయి. నాలుగు ప్రధానద్వారాలకు వెండి తాపడం వుంటుంది. పశ్చిమ ద్వారం దగ్గర కొలువున్న ఆరు అడుగుల పెద్ద నంది విగ్రహమూ బంగారు కవచంతో వుంటుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు. ఆ రోజు ఇక్కడికి వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. కేవలం నేపాల్ వాసులే కాకుండా దేశ, విదేశాలకు చెందిన భక్తులు శంభోశివ శంబో శివ శివశంభో అంటూ తన్మయత్వంలో మునిగిపోతారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం భక్తులు అపరిమిత సంఖ్యలో వస్తారు. గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకోవడాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.

ఆలయాలు

తెలంగాణలో మహా శివరాత్రి వేడుకలు

భారతదేశం వెలుపల ఉన్న శివాలయాలకు తోడు మన దేశంలో, అందులోనూ తెలంగాణలో ఉన్న దేవాలయాలు కూడా చాలా విశిష్టమైనవి. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినాన ఈ దేవాలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

శీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం

దక్షిణ కాశిగా పిలువబడుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కు 36 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకున్నది. ఇక్కడ శివుడు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ కొలువైన స్వామిని శ్రీ రాజ రాజేశ్వరస్వామి అని, రాజన్న అనీ అంటారు. ఇక్కడ భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడె మొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టి వేస్తారు. దీనివల్ల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పవిత్రమైన గండా దీపాన్ని వెలిగించడం కూడా ఇక్కడ ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.

కాళేశ్వరం

ద్వాదశ జ్యోతిర్లింగాల స్థాయిలో ఘనత వహించిన క్షేత్రం కాళేశ్వరం.

శ్రీశైలం, ద్రాక్షారామాలతో కలిపి వీటిని త్రిలింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమ క్షేత్రంగానూ ప్రసిద్ధిగాంచింది. ప్రాణహిత, గోదావరి, సరస్వతి (అంతర్వాహిణి) నదుల సంగమంతో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ ఆలయంలో ఒకే పానవట్టంపై శ్రీకాళేశ్వర-ముక్తేశ్వర స్వాములు ఇద్దరూ రెండు లింగాల రూపంలో కొలువై ఉన్నారు. మాఘశుద్ధ త్రయోదశి మొదలు అమావాస్య వరకు శ్రీకాళేశ్వర-ముక్తేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా అడవిలోని ఆదిముక్తేశ్వర స్వామితో పార్వతీదేవికి అత్యంత వైభవంగా కళ్యాణం చేస్తారు. శివరాత్రి సందర్బంగా అన్ని శైవ క్షేత్రాల్లో ఒక్కసారే శివ కళ్యాణం జరుగుతుండగా కాళేశ్వరంలో మాత్రం రెండు రోజుల శివకళ్యాణం జరిపించడం విశేషం.

రామప్ప దేవాలయము

11వ శతాబ్దానికి చెందిన వేయిస్తంబాల గుడిని కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించారు.

చాళుక్యుల శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం కాకతీయ సామ్రాజ్య కళావైభవానికి మచ్చుతునకగా నిలుస్తోంది. భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంబాల గుడి హనుమకొండ నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన ఆరాధ్యమూర్తిగా లింగ రూపంలో కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ ఉంది. ఉత్తరాభిముఖమై వున్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడి ఠీవీగా దర్శనమిస్తుంది. ప్రతి శివరాత్రిరోజున ఇక్కడ ప్రత్యేక పుజలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.

వేయి స్తంబాల గుడి

శివరాత్రి వేడుకలు జరిగే తెలంగాణలోని మరికొన్ని ప్రముఖ దేవాలయాలు- ఏడుపాయల, కీసరగుట్ట, కొమురెల్లి మల్లన్న, రంగాపూర్ ఉమామహేశ్వర క్షేత్రం, ఐలోని మల్లన్న, వేలాల గట్టు మల్లన్న, నంది వనపర్తి వంటివి ఉన్నాయి.

ఆలంపూర్

శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న ఆలంపూర్ పుణ్యక్షేత్రంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు, జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదినాన బాలబ్రహ్మేశ్వరుణ్ని దర్శించుకునేందుకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తారు. శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్థూపారకంగా ఉంటాయి. అలంపూర్‌లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసి ఉంది. ఆవు పాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలిసి ఉండడం విశేషం.

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఉంది.

Photo credits: Google images

భక్తి గీతాలు