ఎడ్గార్ అల్లెన్ పో


Mon,February 11, 2019 12:55 AM

(1809, జనవరి 19 -1849, అక్టోబర్ 7)
edgar-allanpoepaint
కేవలం రచననే జీవనాధారంగా చేసుకొని బతికిన అమెరికన్ కవి, రచయిత, సంపాదకుడు, సాహితీ విమర్శకుడు ఎడ్గార్ అలెన్ పో. అమెరికన్ సాహిత్యంలో కాల్పనిక భావవాదానికి పునాదులు వేయడమే కాక, కథానికా సాహిత్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఆంగ్ల సాహిత్యంలో డిటెక్టివ్ కథలకు సాహిత్య ప్రతిపత్తి వచ్చేంతస్థాయిలో రచనలు చేసిన కథన శిల్పి ఎడ్గార్.
అమెరికాలోని బోస్టన్ నగరంలోని నటుల కుటుంబంలో జన్మించిన ఎడ్గార్ పుట్టిన కొన్నాండ్లకే, ఆయన తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. మరికొన్నాండ్లకే తల్లి మరణించింది. దాదాపు అనాథగానే ఎదిగిన ఎడ్గార్, సైన్యంలో చేరి కొద్దికాలం పనిచేసే కాలంలోనే అజ్ఞాత నామంతో తొలి కవితా సంకలనం ETamerl -ane and Other Poems(1827)ను ప్రచురించాడు.
ప్రపంచ సాహిత్యాన్ని తన రచనల చేత విస్తృతంగా ప్రభావితం చేసిన ఎడ్గార్ The Raven (1845) పేరిట రాసిన కవిత సాహితీవేత్తలందర్నీ ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన The City in the Sea (18 31), A Dream within a Dream (1849), Eldorado (1849) వంటి ఎన్నో కవితలను, మరెన్నో కథలను రాశాడు. 40 ఏండ్లు మాత్రమే జీవించిన ఎడ్గార్ స్మృతిలో Mystery Writers of America సంస్థ ఏటా మిస్టరీ కథలకిచ్చే అత్యుత్తమ పురస్కారాన్ని Edgar Awardగా ఆయన పేరిటనే ప్రదానం చేస్తున్నది.
ఇక ఈ A Valentine కవిత ప్రయోగపరంగా ఒక విశిష్టమైన కవిత. తను ఎంతగానో ఇష్టపడిన Frances Sargent Osgood అనే స్త్రీ కోసం, ఆమె పేరులోని అక్షరాలనే నర్మగర్భంగా ఉపయోగిస్తూ ఈ కవితను రాశాడు. కవితా రచనలో కూడా Mystery styleని అద్దిన కవితగా ఇది ప్రపంచ ప్రసిద్ధం!

ఒకానొక వాలెంటైన్!

ఆమె కోసమే నేను
ఈ కవితను రాశాను
ఎవరి ప్రకాశవంతమైన నయనాలు
Leda మహారాణి కవల పిల్లల్లా
శోభాయమానంగా అభివ్యక్తం అవుతాయో
ఎవరి మధురనామ స్మరణలో
తమను తాము కనుక్కుంటాయో
ఆమె గురించి రాశాను!
గూడు కట్టుకుంటున్న అసత్యాలెన్నో
పేజీ మీద అల్లుకుపోతూ
ప్రతి పాఠకుని మస్తిష్కాన్ని చుట్టేస్తాయి
వాక్యాలను నిశితంగా అన్వేషిస్తాయి!
వాటిని దివ్యంగా, మంత్రాక్షరిగా, రక్షరేకుగా మలిచి
ఒక విచిత్ర నిధిలా నిక్షిప్తం చేసి
గుండెలపై ధరించాలి
అవి నీ మనోగతాన్ని వెల్లడి చేయాలి!
సరిగ్గా అన్వేషించు
పదాలు-వర్ణాలే
ఇక మనకున్న కొలమానాలు!
ఏ చిన్న అంశాన్నీ విస్మరించకు
లేకపోతే నీ శ్రమ అంతా వృథా అవుతుంది
ఇదేమీ.. విప్పలేనంత సంక్లిష్టమైన ముడి కాదు
ఈ మోహ రహస్యాన్ని
సరిగా అర్థం చేసుకోవడానికి
దీన్ని ఛేదించడానికి
మహాకరవాలమేదీ అక్కర్లేదు
తాళపత్రంపై రాసి, జంట కళ్ళతో,
మిరుమిట్లు గొలిపే ఆత్మతో వెతికినా
అదంతా కేవలం వృథా ప్రయాసే !
కవుల సమక్షంలో
కవుల చేత చెప్పాల్సిన పేరు కూడా కవిదే.. కనుక
ఆ మూడు మార్మిక పదాలను
నేను ఇక ఉచ్చరిస్తాను
దానిలోని అక్షరాలు
అత్యంత సహజంగా కనిపిస్తాయి
యోధుడు Pinto-Mendez Ferdinando
యాత్రా కథనం లాగా..
ఇన్ని చేసి
ఒక మహా సత్యానికి పర్యాయపదాన్ని
రూపొందిస్తూ-కనుక్కుంటూ
ఆ ప్రయత్నంలో విఫలమై చేతులెత్తేస్తాను !
చివరికి నీ సర్వశక్తులూ ఒడ్డి
ఏకాగ్రచిత్తంతో సమాలోచించినా
ఎప్పటికీ నువ్వు.. ఈ పొడుపు కథను విప్పలేవు!
మూలం: ఎడ్గార్ అల్లెన్ పో
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles