హితైShe


Mon,October 21, 2019 12:35 AM

అనాదిగా అతివ జీవితమెప్పుడూ అనకొండల మధ్య సంచారమే..
ఇంటా బయటా-రోడ్ల మీదా-పని ప్రదేశాలలో-మీడియాలో
ఆడపిల్లే బానిసకొక బానిసైన మొదటి-ఆఖరి బలి పశువు
రెక్కలు కత్తిరించి-పంజరాల్లో బంధించి
ఇనప కచ్చడాలు బిగించి స్వేచ్ఛను హరించి
కాళ్ళకి సంకెళ్లు వేసి-కళ్ళకు గంతలు కట్టించి
దేహాన్ని రవాణా చేయించి-ముఖాల్ని అమ్మేసి
ఎన్నెన్ని వంచనలు.. ఎన్ని అణిచివేతలు చూపారు
శతాబ్దాలుగా ఇదే హింస! ఇదే ఆక్రందనల పర్వం!
ఇంకానా! ఇక చాలు..!!
యుగానికో అసురుడు పుట్టిన నేల కదా!
అతని వధ కోసం ఆయుధ సృష్టి జరిగిన భూమి కదా!
ఈ కలికాలంలో మానవాసురలకు ఒక్క ఆయుధం చాలదు
త్రిశూలం-చక్రం- వజ్రాయుధం-గద
ఆగ్నేయ-పాశుపత -వరుణ-బ్రహ్మాస్ర్తాలు
అన్ని కలిసిన మహాయుధం కావాలి
త్రినేత్రపు శక్తి పొందిన మహాజ్వాల కావాలి
ఆ ఆయుధశక్తే- ‘షీ’ టీం
ఒక్క వ్యక్తి అలజడి సమాజ ప్రశాంతతకు కొడుతోంది గండి
ఒక్క అపసవ్య ఆలోచన వందలాది గుండెలకు కలిగిస్తుంది వేదన
ఆ తలలను మొగ్గలోనే గుర్తించే hawk eye-‘షీ’ టీం!
అమ్మలా అలెర్ట్‌ చేస్తుంది! సోదరిలా వార్నింగ్‌ ఇస్తుంది!
గురువులా కౌన్సిలింగ్‌ చేస్తుంది! పెద్దలా కుటుంబానికి నివేదిస్తుంది!
సామదానభేద ఉపాయాలతో ప్రవర్తనలో పరివర్తనకు తెరలు తీస్తుంది
మితిమీరితే-శృతిమించితే కేసు, కోర్టు మెట్లు ఎక్కించి
అపసవ్యతకు అంతిమగీతం పాడుతుంది
Sheలోనే He ఉన్నాడనే సభ్యతను నేర్పి
స్త్రీ గౌరవంలోనే సమాజహితం ఉందని
వ్యక్తి చైతన్యం ద్వారానే వ్యవస్థ మార్పు సాధ్యమని
పెంపకం నుంచే ఆరోగ్య ప్రపంచం నిర్మించాలని
అవసర అవగాహనని కలిగిస్తుంది..
ఇక-మనం స్వేచ్ఛగా చూపులకు కలల్ని
ఆశలకు మెరుగుల్ని-లక్ష్యాలకు రెక్కల్ని
ఉనికికి ఆత్మగౌరవాన్ని-అస్తిత్వానికి రంగుల్ని
జీవితానికి ఆశయాల ఆకాశాన్ని అందిద్దాం..
అవును! ఇప్పుడు SHE టీం-మనందరి హితైSHE
మన ప్రగతి అభిలాSHE -మనోవికాస ప్రియాదర్‌SHE
నాగరిక సమాజ మహర్‌SHE-ప్రతి స్త్రీ - ఇప్పుడొక క్రాంతదర్‌SHE
Sheteam-మనకొక నిరంతర మార్గదర్‌SHE
- శ్రీలక్ష్మీ ఐనంపూడి, 99899 28562

101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles