మరపు


Mon,October 7, 2019 12:14 AM

GORATI
తెలిసిన దారిని మరిసి
తెలియక నడిసితె హాయి
వలసిన మురిపాల నొదిలి
నడిసి పోవ కలల కదిలి
నింగి నీటి మబ్బు వోలె
పొంగె ఏటి కొప్పు వోలె
బరువుల నొదిలించుకొనె
మరుగు నెరిగి సాగవోయి
తీరంలొ పడవ బరువు
పయనంలొ నడక సులువు
చలనంలోనున్న ఏరు
శిలలనైన కరుగజేయు
పంచుకున్న పరువాలు
పయనానికి సంకెళ్లు
నిమిరె నీలి పవనాలు
నీ నడకకు వయనాలు
దివ్వె ఆరలేదనుకుని
తోవ రేయి నడవాలె
బాట మట్టి రేణువులె
పాటకు దరువెయ్యాలె
నిలకడలేని గెలుపులు
ఊసుల చివురుకు చీడలు
కాసెసెట్టు వంగినట్టు
ఉంటె పదం తలుపుదట్టు
సిరులు వనగూడె వేళ
లేమియె నీ జపమాల
మెప్పుల తిరనాల కన్న
ఒంటరి గమనమె మిన్న
మెరుపులాంటి పదములకు
మరుపనేది ఒక వరం
కలల పలవరింత వోలె
కవిత గొంతునొలకాలె
- గోరటి వెంకన్న

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles