ఉద్వేగాల ఊయల


Mon,October 7, 2019 12:14 AM

జీవితంలోని ఎత్తు పల్లాలను వేలాడేసినట్టు
మెట్రో ఉద్వేగాల ఊయలై
కొన్ని నవ్వులను కొన్ని కోరచూపుల్ని
కొన్ని ఆశలను కొన్ని ఒంటరి వేదనలను
మోస్తూనే ఉంటుంది
గమ్యాలను చేర్చుతూనే ఉంటుంది...
నీటిమీద నడకలా
అందరూ రహస్యదారులను
ప్రాక్టీస్‌ చేస్తుంటారు
నిశ్శబ్ద తరంగంలా నగరం
చుట్టుముడుతుంటుంది
చొచ్చుకొచ్చే వేణునాదంలా
చైతన్యాన్ని చుట్టచుడుతుందో యువకెరటం...
ఆరాటాలన్నీ ఇంకిపోగా
పోరాటాల ఆయుధాలను పైన దాచిన
ఓ పెద్దాయన జ్ఞాపకాలను
బుడగలుగా వదులుతున్నాడు
బువ్వ కోసం పాకే పిల్లాడైపోయాడు...
భావనలు చేతనలు యాతనలను
వనాల గుహల్లో దాచేయగా
యంత్రాల్లాంటి మనుషుల్లో
మనసింకా మనిషిలానే ఉంది
పొద్దున్నే పలికే పిట్టను
కళ్ళలో దాచుకుంది
గాలిపాటను తన కుహరాల్లో నింపుకుంది...
పహరాకాసే ప్రపంచం కునికిపాట్లు పడుతోంది
కొల్లగొట్టే మనుషుల కోరలు పీకేదెవరంటూ
కూనిరాగాల సాయంత్రం కులుకుతోంది
మాంద్యం... గ్లోబల్‌ మేండొలీన్‌ తీగలు
సవరిస్తుంటే
చినిగిన ఆశలను కుడుతున్న యువత
రాలేపూల పరిమళాన్ని పీల్చటం మానలేదు
యంత్రాలను నియంత్రించాలన్న
ఉబలాటమూ ఆగలేదు
ఊపిరితీసే దారిద్య్రాన్ని ఉరేయాలనే
ఉత్సాహమూ ఆగలేదు
అవును ఉద్వేగాల ఊయలై
చకచకా సాగుతోంది మెట్రో
- సి.యస్‌.రాంబాబు, 94904 01005

97
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles