విషాద విదూషకులు


Mon,September 30, 2019 12:42 AM

వీళ్ళ ఏడుపంతా
నవ్వించడానికే
నలుగురి మధ్యలో నిలబడి
నవ్వించడానికి
ఒంటరిగా ఉన్నప్పుడు బహుశా!
పగిలిపోయిన లోపలి పొరల్ని
రహస్యంగా కుట్టుకుంటారనుకుంటా
నవ్వడము, నవ్వించడమే వీరికి
భోగము, భోజనం కనుక
తెరవెనుకో తెరముందో జారిపడ్డప్పుడల్లా
నవ్వులపాలవుతూనే ఉంటారు
పువ్వులు పూయాలంటే
రుతువులు రావాలి కానీ
ఏ కాలములో అయినా నవ్వులు
పూయించగల
నేర్పరులు వీళ్ళు
ఎండా వానా అక్కరలేకుండానే
అందరి ముఖాలపై నవ్వుల
ఇంద్రధనువులను పూయిస్తారు.
కన్నీరొచ్చేలా - ఏడ్పించినవాళ్ళను
నవ్వించిన వాళ్ళే కదా
మనం కలకాలం గుర్తుంచుకుంటాం
లోపల సుడులు తిరిగే దుఖః సముద్రాల్ని
మోస్తూ కూడా
అలల చేతులతో మనల్ని
కవ్వించి, నవ్వించి
అదృశ్యమైపోతున్న విధూషకులకు
నిండు కళ్ల నుంచి జారిన
రెండు చుక్కల నీరు
ఆనందభాష్పం ఒకటి
అశ్రునివాళి ఒకటి
ఏ కన్ను నవ్విందో, ఏ కన్ను ఏడ్చిందో
చెప్పలేనితనం
రెండు వాళ్ళ స్మృతులే....

- గణేష్‌ పెద్దిరెడ్డి
(చార్లీ చాప్లిన్‌ మొదలు వేణుమాధవ్‌
వరకూ తెరవెనుక విషాద జీవితాల్ని మోసి తెరముందు నవ్వించి నిష్క్రమించిన విదూషకులందరికి)

93
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles