అతడొక గెలాక్సీ!


Mon,August 26, 2019 12:53 AM

Sinare
అతడు ఒకానొక సామాన్యుడు-
అందరికన్నామిన్నగా మట్టిని పులుముకున్నవాడు
మనిషిని తనకన్నా ఎక్కువగా నమ్మిన వాడు
ఆకాశాన్ని హద్దుగా నిర్ణయించుకున్నవాడు
అందుకేనేమో అతడు
గేయాల గురువు
కవితల కల్పతరువు
చిత్రగీతాల తేజస్వి
గజళ్ళ తపస్వి అయ్యాడు !
అతడు -
శబ్ద చాలనమై సాగే పాట
అందుకేనేమో పాటకు గ్లామర్ని కూడా అద్దాడు
పద విన్యాసమై సాగే మాట
అందుకేనేమో మాటకు గ్రామర్‌ని కూడా దిద్దాడు
బహుశా -
పదాల ప్రయోగాలు అతడికి తెలిసినంతగా
ఏ భాషా నిపుణుడికీ తెలియదేమో
అక్షరాల మనసు అతడు డీ కోడ్‌ చేసినంతగా
ఏ కవికుల ఋషీ ఎరుగడేమో
ప్రకృతికి నచ్చే కృతులేమిటో అతడు గుర్తించినంతగా
ఏ భావుకుడూ ఊహించలేడేమో
మనిషి తత్వాన్ని అతడు పసిగట్టినంతగా
ఏ లేఖకుడూ కృతి కట్టలేడేమో
మామూలు పద్యానికి ఆర్ద్రతల ఊపిరిలూదటం
సాధారణ ఆలోచనలకు సాంద్రతల జీవం పోయడం
అతడికి మాత్రమే తెలిసిన విద్య !
అతడు -
సకల ప్రక్రియల సాహిత్య కీర్తి
చమత్కారాలతో ఆకట్టుకునే సభామూర్తి
ఏ రంగాన్నైనా ఏలగల సమయస్ఫూర్తి
అందర్నీ సమాదరించే స్నేహ దాహార్తి
మొత్తంగా అతడొక హృదయ సమవర్తి !
అతడు-
పాఠాన్ని, పాటని రెక్కలుగా మొలిపించుకుని
ప్రతి పుట్టినరోజుకి ఓ పుస్తకాన్ని ప్రసవిస్తూ
తెలుగు నుడికట్టును ఆత్మగా
పంచె కట్టును ఆహార్యంగా
మలుచుకున్న కవిరాజు!
అతడు-
కూతుళ్ళనే నదులుగా కళ్ళ కద్దుకుని
తెలంగాణాన్నే తేనె మాగాణంగా భావించుకుని
విశ్వాన్ని తన అంతరంగంలో ఆత్మీకరించుకున్న విశ్వంభరుడు!
అయితే అతడు అతి సామాన్యుడు
అందరిలాంటివాడు
కానీ, అందరికన్నాఎక్కువగా
అక్షరాన్ని కౌగిలించుకున్న వాడు
అనుభూతుల్ని శ్వాసించిన వాడు
జీవితాలను ప్రేమించిన వాడు
అందుకే అతడు తాగిన మానేరు నీరు
నడిచిన హనుమాజీపేట వాడ
చదివిన సిరిసిల్ల వొడి
పాఠాలు చెప్పిన ఉస్మానియా బడి
నిత్యం అతడ్ని తలుచుకుంటాయి
ఇప్పుడు అతడు చల్లిన అక్షర విత్తనాలు
వృక్షాలుగా ఎదిగాయి
అవి నిరంతరం సాహిత్య పుష్పాలను
కవిత్వ ఫలాలను విరగకాస్తున్నాయి!
అయినా అతడు అత్యంత సామాన్యుడు
అందరిలాంటి వాడు
కానీ, మృత్యుంజయుడు
వ్యక్తిగా అంతమై
సాహిత్యంగా అనంతమైనవాడు
అక్షరమైన వాడు ... ఆకాశమైనవాడు.
ఇప్పుడు అంతరిక్షమై వ్యాపించినవాడు!
అతడు -
నిన్న-మనిషి
నేడు-రోదసి
రేపు-గెలాక్సీ!
- అయినంపూడి శ్రీలక్ష్మి, 99899 28562

72
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles