ఇంకా ఇల్లు రాలేదు


Mon,August 26, 2019 12:52 AM

highway
ఎక్కడికి వెళ్ళినా
ఎందుకైనా మంచిదని
ఒక పద్యం దగ్గరుంచుకుంటాను
ఎప్పుడు నొప్పిలేచినా
పక్కజేబులోంచి తీసి
చప్పున గాయాన్ని మూసేస్తాను
ఇంతమంది వుంటారని
ఈ సభకు రాలేదు
కొందరికైనా
నా బాధ అర్థమవుతుందని
మనసు విప్పి మాట్లాడుతున్నాను
అద్దం తుడుచుకోక
చాలా రోజులయింది
ముఖాన్ని చూసుకుంటే
నన్ను నేను,
గుర్తుపడతానో లేదోనన్న అనుమానం వచ్చి,
మరిచిపోవడం-
అలవాటు చేసుకున్నాను
అన్నిదారులూ, అడ్డంగా నడిచివచ్చినా
ఇంకా ఇల్లు రాలేదు
ఎంత అలసిపోయినా
బాట పక్కన, మిగిలిన చెలెమల్లో
కొంచెంకూడా దాహం తీరలేదు
ముంచే వానా-వణికించే చలీ- మాడ్చే ఎండ
రాత్రి పగలని చూడకుండా
కాలం వడివడిగా తొక్కుకుంటూ
పడిలేస్తూ వెళుతోంది
ఏ మైలురాయి దగ్గరో ఆగినప్పుడు
దాచుకున్న అద్దాన్ని
చాలా మోహంగా చూసుకొంటాను
తుఫాన్లకు గాట్లు పడిన నా ముఖం
మచ్చలు మచ్చలుగా మెరిసే
అడవిలోని పులిలా వుంటుంది
- ఆశారాజు, 93923 02245

84
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles