క్షేత్రజ్ఞత


Mon,June 24, 2019 01:17 AM

lonely
అయస్కాంత క్షేత్రాల మధ్య
వినిమయ మోహ వికర్షణ
తపశ్శక్తి తడారిపోయి
గుక్కపట్టి ఏడుస్తున్న మనశ్శరీరాలు-
ఈ కళ్లలోంచి ఆ కళ్ల మీదికి
ధ్వంసమైన వెన్నెల వంతెన
ఈ పెదవి మీంచి ఆ పెదవిపైకి
దగ్ధమవుతున్న దరహాసం
అవతలి గుండెపై వాలబోయి
రెక్కలు తెగి కుప్పకూలిన పక్షి
కుప్పనూర్పిడిలో చేతులు సమాధై
స్పర్శ కోల్పోయిన కరచాలనం
పదకోశంలో కిక్కిరిసిన సమూహాల నడుమ
అర్థాలు వెతుక్కుంటున్న ఆలింగనాలు!
ఏ ఇంటినీ మినహాయించలేం
వరండాల నిండా హోరెత్తే గొంతులు
డ్రాయింగ్ హాళ్లను కమ్మేసిన మేఘాలు
డైనింగ్ టేబుళ్ల చుట్టూ కోటగోడలు
వంటగదుల్ని ముంచెత్తే నదీప్రవాహాలు
ఆఖరికి
పడకగదుల్నీ ఆక్రమించిన ఆగంతక సంకేతాలు
రక్తకణాలకు రక్షణ గోడలుండవు
యుద్ధాల వెనుక కుట్రలు అర్థం కావు
ఆయుధాలకు ఆర్తనాదాలు వినిపించవు
మానసిక మాంద్యం దెబ్బకు
దేహాల సరిహద్దులు మూతబడతాయి
మాయలఫీకర్ కోసం
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో తల దూర్చావో
నీ సందేహం వేయి వక్కలవుతుంది
సందేశాల్నీ వాక్ప్రవాహాల్నీ నేలమట్టం చేసి
ఓసారి నగ్నంగా ముట్టుకుని చూడు
మట్టినీ అందులోని ఇనుపరజనునీ-

విజాతి ధ్రువాలు
క్షేత్ర పర్యటనకు బయల్దేరుతున్నాయి!
- ఎమ్వీ రామిరెడ్డి,
98667 77870

129
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles