ఇలకోయిలలా రాత్రంతా నిద్రిస్తూ..


Mon,May 13, 2019 12:50 AM

mo
ఆత్మల అంతర్యాన్ని అర్థం చేసుకున్న మనకు
బాహ్య ప్రాపంచిక సుఖాలు వద్దు
పరస్పర ముఖారవింద సౌందర్యాలు అసలే వద్దు
మనిషి శరీరపుటందాలు అశాశ్వతమైనా
మనలోని నుడికారపు నిర్మల గుణం
శాశ్వతం.. నాశ రహితం!
దృత గోచరాలనే ప్రేమించే మామూలు మనుషులు
శరీరాలను వాంఛిస్తారు.
పరస్పర ప్రేమానుభూతుల విలువ పోగొడతారు
తొలి చూపు నుంచి చూపే వారి ప్రేమ
ఎక్కువ వెలుగు నిచ్చినట్లనిపించే
తక్కువ చమురున్న దివ్వెలాంటిది
ఇరువురి శారీరకానుపస్థితుల్ని
భరించలేని వారి ప్రేమకు
విశ్వాంతరాళంలో రేణుకోటి లాంటి ప్రపంచాన
సూక్ష్మరేణువు కూడా కానివారి అనురాగపు విలువలు
ఏమాత్రం నిర్వచనీయం కానేరవు..
ఆలేఖ్యం అసలేకావు!
మన శారీరక ఎడబాటును సహించే నీవు
విజయంతో నీ దరి చేరే నాలో
మానసిక స్థైర్యాన్ని నింపావు
సూర్యోదయపు నీరెండ నుండి
కన్పించే మన ఉనికికి నీవు, నీ నీడనైన నేను
ఇరువురమూ ఒక్కరే..
నీలో నే కలిసిపోవాలని, నీలోనే కలిసిపోవాలని
తహతహలాడే నీ మనసుకు
ఊరట కల్గించే మధ్యాహ్నం కోసం
కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తాను
భాస్కరుడు సరిగ్గా నీ నడినెత్తిన భాసిల్లే సమయాన
మన ఇరువురిలో నీవొక్క దానవే కనబడ్తావు..!
నీ నీడనైన నన్ను నీలో కలుపుకుని
నను చూడాలనుకునే విశ్వకోటిని
నా అనుపస్థితితో కలవరపెడ్తావు..!
ఉత్తరాహ్నంలో నీ నుండి నే దూరమౌతున్నప్పటికీ
దొంతరల వంటి మన ఆత్మల బిగువు నుండి
విడిపోలేననే తృప్తితో
తిరిగి సూర్యోదయం కోసం ఎదురు చూస్తాను
మధ్యాహ్నం నుండి సూర్యాస్తమయం వరకు
దూరంగా పయనించే నేను,
ఆ తర్వాత, నాతో పాటు కన్పించని నీవు
ఒకే క్షణాన అదృశ్యమౌతాం
విశ్వమానవ ప్రేమను ఇనుమడింప జేయడానికి
ఇలకోయిలలా రాత్రంతా నిద్రిస్తూ
ఇంద్రియాతీత ప్రేమ బోధనకు సిద్ధమౌతాం..
తిరిగి ఉదయం కోసం ఎదురుచూస్తాం..!
కోమల కాఠిన్యాలకు ప్రతిరూపాలైన మనం
ఉపస్థితిలో అనుపస్థితిని
అనుపస్థితిలో ఉపస్థితిని ప్రకటించగలం
నత్తవంటి మన రూపానికి
కోమల శరీరభాగం నీవు, కాఠిన్య గుల్లభాగం నేను
తాబేలు వంటి మన ఆకారానికి
అంతర్ సౌందర్యానివి నీవు, బాహ్య కవచాన్ని నేను
నీ స్థైర్యానికి స్ఫూర్తిని నేను
నా ధైర్యానికి ప్రేరణ నీవు..
సూర్యోద్యయం నుండి ప్రారంభమైన నా గమనం
చక్రంలా తిరిగి తిరిగి
నీవు నిలుచున్న స్థలమే ఆద్యంతాలుగా ముగుస్తుంది
చూపరులకు మాత్రం అర్ధవృత్తంలా గోచరిస్తుంది..!
ప్రేమతో నిండిన మన మనసులు
మనసున్న మనుషుల పరిపూర్ణ హృదయానుభూతులకు
కేవల ప్రమాణాలు..
మన ఆత్మల అంతరాత్మలతో సైతం
మనసులతో సంభాషించిన మనకు
మరణం ఓ లెక్క కాదు
అదే మరణం మన దరిచేరే క్షణాన కూడా
గుసగుసలో ధదిలో అలికిడి లేని మనసులతో
మన ఆత్మలు క్రీడిస్తుంటాయి..
-డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, 9848023090

(2013 ఏప్రిల్ 13న బంగ్లాదేశ్‌లో రాణాప్లాజా అనే ఎనిమిదంతస్తుల భవనం పై కప్పు కూలి వెయ్యిమందికి పైగా మరణించారు. అలా చనిపోయిన వారిలో మరణంలోనూ వీడని సాంగత్యాన్ని చూసి.. చలించి..)

169
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles