నిర్జన గృహం!


Mon,May 13, 2019 12:49 AM

ఈ ఇంటిని చూడు, యెంత చీకటిగా ఉందో
విశాలంగా జడలు విరబోసుకున్న ఆ మహా వృక్షాల కింద
ఎత్తైన ఆకాశపు నిఘా నీడల కింద
సమాంతర గాలి చరుపులకు వణుకుతున్న
ఏ చిగురుటాకూ దుఃఖించదు !
వదులు! వదిలిపో!! నీ అనుమానపు దృక్కులను
స్వచ్ఛంగానే ఉంచు స్వర్గ మార్గాలను..
వెన్నెలను ఇక పొదగకు చంద్రుడా,
కనుచూపును మరుగుపరిచే రహస్యాలఫై
వికృత వెలుగులను వెదజల్లకు!
ఇవి రహస్యాలు ! అని రాత్రి పవనం నిట్టూరుస్తుంది
నేను కనుగొన్నదల్లా ఖాళీలనే
నేను చేసిన ప్రతీ తలుపు తాళపు రంధ్రం
ఆక్రందనై, దుఃఖితయై, మూర్చిల్లుతుంది !
ఏ గొంతూ నాకు జవాబివ్వదు
కేవలం శూన్యం మాత్రమే !
ఒకప్పుడు, ఒకానొకప్పుడు... అంటూ కీచురాయి రొద చేస్తుంది
దూరంగానూ, దగ్గరగానూ నిశ్శబ్దమే
తన చిన్నారి గొంతుకతో ఈ ఖాళీని నింపుతుంది
ఆ తర్వాత మళ్ళీ రణగొణ సవ్వడి అందుకుంటుంది
గోడలపై మూగ నీడలు
గంటలు, సమయం ఎలా గడుస్తుందో గీతలు వేస్తూ
నెమ్మదిగా ప్రాకుతున్నాయి
ప్రతి రాయీ మెల్లగా విచ్ఛిన్నమవుతుంది
చివరాఖరి గాలి విసురుకు
నిమ్నాతి నిమ్నమైన పరమాణువులు కూడా కదులుతాయి
కప్పుపై, గోడలపై
కొన్ని పెళుసుబారిన శిథిలాలు రూపుకడతాయి
గమనించావా నువ్వు
చిక్కగా అల్లుకున్న ఈ మహావృక్షాల దిగువన
ఇదంతా యెంత చిమ్మ చీకటిగా ఉందో ....!
మూలం: వాల్టర్ డి లా మెర్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ 8008005231

146
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles