నీళ్లకు కాళ్లు వచ్చినయ్


Mon,May 6, 2019 01:09 AM

KALESHWARAMchelimi
అది ఎల్లంపెల్లి అయితేనేమి
అది కాళేశ్వరం అయితేనేమి
అది గోదావరి అయితేనేమి
అది ప్రాణహిత అయితేనేమి
నీళ్లు ఎదురెక్కి వచ్చుడు ముఖ్యం
జీవధార కౌలు, రైతుల ప్రాణాధారం
కానున్నాయనేది ప్రధానం..!

లక్ష్యం చిత్తశుద్ధి వుంటే
సితపాతాళం లోతునుంచి కూడా
నీళ్లను వెతంఎత్తి పొయ్యవచ్చు

నీళ్ల కోసమే ఉద్యమ నిప్పురాజుకుంది
వేలమంది జీవునాలను తీసుకుంది
అల్కగా ఉఫ్‌మని ప్రాణాలను ఊదేసింది

ఇప్పుడు నీరు
బీడు భూములపై రెక్కీ నిర్వహిస్తుంది
గోసను చూసి నీరు నీరై పోయి
నీళ్లకు చేతులచ్చినయ్
కన్నీళ్లను తుడవడానికి

తెలంగాణ అంతా
సలసల మసిలే వలసల గాయం
అణిచివేతల త్యాగాల గానం
బిడ్డల్ని దేశాలకు సాగనంపుతూ
గొడగొడ ఏడ్చే తల్లిదండ్రులు
భార్యాపిల్లల్ని విడిచిపెట్టి పయనమయ్యే
ఏడేడు సముద్రాల ఏడ్వేడ్వని ఒంటరి దు:ఖాలు

అక్షరాల్ని అంకెల్లోకి మారకం
చేసుకోవడం గొప్పకాదు
అద్వైత విధానాలకు
భాష్యాలు రాయడం పెగ్గెలు కాదు
ఎగజల్లిన బతుకు మెతుకులకు
ఇవ్వాలని గుండె ధైర్నం

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలె
నీళ్లకు తప్పటడుగుల నడక వచ్చింది
బీళ్లకు లేచిగురు నోళ్లు వచ్చినయ్..!
ఇప్పుడు నీళ్లకు నిజంగా కాళ్లు వచ్చినయ్..!!

-జూకంటి జగన్నాథం, 9441078095
(నంది మేడారం దగ్గర గోదావరి నీళ్లను కండ్ల చూసినప్పుడు..)

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles