ఎదురుకోలు!


Mon,May 6, 2019 01:07 AM

గాఢ వాంఛ.. విప్పలేని రహస్యం, చెప్పలేనంత సంతోషం
చిక్కని నలుపు నీడలు నెమ్మదిగా జీరాడినట్టుగా
తేలికపాటి నిమ్మళమైన గమనాల భ్రమలుగా
మాగన్ను వంతెన మీంచి నువ్వు నడిచొచ్చిన క్షణం..

రాత్రి నదియై ప్రవహించింది
శాటిన్ వస్ర్తాల్లాంటి సెలయేళ్ళపై మౌనం తేలియాడింది
తోడేలు ముఖపు నల్లని ముసుగుతో దుశ్శకునాలు
ఛిన్నాభిన్నం చేసిన నీ లేత పెదాల పదాలు
Chestnut చెట్ల దిగువన కాలువ గట్టు వెంట నువ్వెళ్ళావు
నన్ను పిలుస్తూ, పక్కాగా నా కోసమే
నా హృదయం నీలో ఏ చింతనలను రేపిందని?
నన్ను నువ్వు అంతగా ఎలా కదిలించగలిగావని?

నీ తక్షణపు లాలిత్యంలో
విస్తారమవుతున్న నీ భుజాల కొలతల్లో
ఏదైనా తిరిగి తీసుకురాలేని ఎదురుకోలుని
నేను లీలగా అనుభూతి చెందానా?

బహుశా, ఒక శృంగారాత్మక దయ ఏదో
నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి దోహదపడిందేమో
నా ప్రేమ పలుకుల ద్వారా గుచ్చుకుని
ఒరుసుకుంటూ దూసుకెళ్తున్న మోహ బాణాన్ని
వణికిస్తున్న కారకం ఏమిటో తెల్సిందేమో!?

నాకేమీ తెలియదు
వచనం వింతగా ప్రకంపిస్తోంది
ఆ కంపనల మధ్య ఓ ప్రేమ బాణం
బహుశా, ఇంకా అనామకంగానే విశుద్ధంగానే ఉంది
దానికోసం నిరీక్షిస్తున్నది నువ్వే నంటావా?

కానీ, విషాదం సంపూర్ణ దుఃఖంగా బైటికి దూకలేదు
అయితేనేం, మన నక్షత్రపు ఘడియలను తలకిందులు చేసింది
నీ నయనాలు రెండుగా విచ్చుకొని
వెలుగులు చిమ్మకుండానే రాత్రిలోకి జారుకున్నాయి

ఇంకా యెంత కాలం? ఎప్పటికీనా? ఇంకెంత దూరం?
నేను సంచరించగలను?
మనం ఎదురు పడినప్పుడు
తారలు చలించిన తీరును చూడు
నువ్వే నా భాగ్య విధాతవని చెప్పాయేమో..

ప్రగాఢ ఆకాంక్ష, ఛేదించలేని రహస్యం, తట్టుకోలేని ఆనందం
ఇది ఓ సుదూరపు దీర్ఘకాల విన్నపం
ఒకవేళ, విధి నా నుదుట రాసింది నిన్నే అయితే
ఈ క్షణం నా మనసు నీ వైపుగానే పయనించాలి
నీ నామమే జపించాలి.. నీ కోసమే తపించాలి..

మరి, ఇదంతా అదే కదా...!?

మూలం: వ్లాదిమిర్ నబొకొవ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ , 8008005231

115
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles