నడవాల్సే ఉన్నది


Mon,April 15, 2019 12:30 AM

Nadavalse-unnadi
ప్రయాణించవలసిన మజిలీ ఇంకా మిగిలే ఉన్నది
నడుస్తున్న పాదాలింకా విశ్రమన కోరలేదు
దారి దారంతా పరుచుకుంటున్న
చీకటి మబ్బు తునకల్ని ఛేదిస్తూ
నీడలా వెంటాడుతున్న నైరాశ్యపు
చలిగాలుల తాకిడి నుండి కాపాడుకుంటూ
బాటమీద పాదముద్రల్ని ముద్రిస్తూ
ఇంకా నడవాల్సే ఉన్నది
నువు నాతో పాటుగా సాగుతున్నప్పడే
భయాల ముళ్ళకంచెలూ ఎగుడు దిగుడు రహదారులనూ చర్చించే ఉన్నాం
నా పెదాలపై నీ పాట చేసిన సంతకపు తడి
నా పాదాల్లోకి ప్రవహించి లేపనమవుతున్నది
నేను నీకు ముందే చెప్పాను..
మన రాక కంటే ముందే ఈభూమ్మీద
కుట్రలపై కుట్రలూ... మోసాలపై మొసాలూ దాగి ఉన్నాయని
నేను నీకు ముందే చెప్పాను
గాయపడిన పాదాలతో
రహదారిలో చిలికిన అమరుల రక్త
మరకలను మోసుకొని నువ్వొస్తున్నప్పుడు
కీర్తికాంక్షల కీచురాళ్ళు నిన్ను గానం చేసి దారి తప్పిస్తాయని
నువు శుభ్రపరుస్తూ వచ్చిన దారినిండా
అవకాశాల తోడేళ్ళు మకాం వేసుకుంటాయని
చుట్టూ ఆవహించిన కారుచీకటి లోనుంచి నువు నాకోసం ఎదురుచూసిన
ఆశల పూలగుత్తుల పరిమళమే నన్ను నీదగ్గరికి చేర్చింది
గూట్లోని దీపం కన్నుమూసిన తరువాత
కొమ్మల్లోని పక్షులురెక్కల్లోకి ముక్కుల్ని దాచుకొని
కనురెప్పలపై రేపటి ఆశలను నాటుకుంటున్నప్పడు
నేను అడవిదాటి.. ఏరు దాటి..
యుద్ధ సరిహద్దుగుండా నిన్ను వెతుక్కొని
ప్రయాణించవలసిన బాటను చర్చించినప్పుడు
నువు పెనవేసిన సందేహాల కౌగిలికి అభయమిచ్చిన వాన్ని
నా చెవిలోకి వంగి నువు సంధించిన ప్రశ్నల్ని గుండెలపై మోస్తున్న వాన్ని
తరతరాలుగా అన్యాయంపై తిరగబడ్డ
నా పూర్వికుల యుద్ధ వస్ర్తాలను ఒంటినిండా చుట్టుకున్న వాన్ని
నా ముందుతరం వేస్తూ పోయిన వెన్నెల సాలుగుండా
ప్రయాణించి వచ్చిన వాన్ని
సిరస్సును వేయిచూపుల రహదాల్ని చేసిన వాన్ని
సిరస్సునెలా వంచుతాను..!
లోకపు కన్నీటి రుచి తెలిసినవాన్ని
గాయాల్లోంచి గేయాలను ఆలపించిన వాన్ని
నడక నాకు అలసట కాదు.. తప్పనిసరి అలవాటు
ఎగుడు దిగుడు రహదారిని చదును పరిచే
నా ప్రయాణపు భరోసని దారినిండా వెదజల్లుతున్నాను
నాతో పాటుగా సాగే నీ పాదాలకు యుద్ధ భూమి నుండి మోసుకొచ్చిన
శౌర్యపు గంధాలను పూస్తున్నాను
రేపటి ఆశకై నా భుజాన్ని తాకిన నీ అరచేతుల్లో
అమరుల రక్తంతో తడిసిన మట్టి సిరాతో సంతకం చేస్తున్న
మనమింకా నడవాల్సే ఉన్నది
మన పాద ముద్రల చిత్తరవులతో
ఈ దారి దారంతా చిత్రించవలసి ఉన్నది.. ...

- చెమన్, 94403 85563

119
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles