సీమస్ హీనీ


Mon,April 15, 2019 12:29 AM

(1939,ఏప్రిల్ 13-2013, ఆగస్టు 30)
Seamus-Heaney
20వ శతాబ్దపు మహాకవుల్లో ఒకడి గా పేరుపొందిన సృజనకారుడు, అనువాదకుడు, నాటకకర్త, కవి సీమస్ జస్టిన్ హీనీ. తన మాతృభూమి ఉత్తర ఐర్లాండ్‌లోని పరిణామాలు, సంక్షుభిత గ్రామీణ-నగర జీవనం, బ్రిటిష్ పాలన కింద నలిగిపోయిన భాషా సంస్కృతులు, ఆధునిక పోకడలే వస్తువులుగా తన కవిత్వాన్ని సృష్టించిన హీనీ, తాను ఎంపిక చేసుకున్న కవితా వస్తువుల వల్ల సామాన్య పాఠకు ల అభిమానాన్ని సైతం చూరగొన్నాడు. తన ప్రాంతీయత నుంచే ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో కృతకృత్యుడయ్యాడు.

ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంట్ డెస్రీ ప్రాంతంలో మైనార్టీ క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన హీనీ తన బాల్యం, యవ్వన కాలంమంతా దేశంలో సంభవించిన నిరంతర అంతర్యుద్ధాలను చూస్తూ పెరిగాడు. వాటివల్ల కకావికలమవుతున్న గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూశాడు. బెల్‌ఫాస్ట్‌లో ఇంగ్లీష్ సాహిత్య విద్యార్థిగా ఉన్న కాలంలో Ted Hughes, Patrick Kavanagh, Robert Frostల రచనలను విస్తృతంగా అధ్యయనం చేసి, తానుకూడా వారిలాగే కవి కావాలని, తన హృదయ భావాలను వ్యక్తీకరించడానికి కవిత్వమే సరైన మార్గమని నిశ్చయించుకున్నాడు.

హీనీ తన మొదటి కవితా సంకలనం Death of A Natura -list (1967)తోనే సాహితీలోకంలో సంచలనం సృష్టించి, ఆ తర్వాత Door into the Dark (1969), Wintering Out (19 72), North (1975), Stations ( 1975-- Prose Poems), Field Work (1979), Seeing Things (1991), The Spirit Level (1996), Electric Light (2001), District and Circle (2006) వంటి కావ్యాలతో ఎప్పటికప్పుడు ప్రపంచ సాహితీ ప్రేమికులకు కొత్త అనుభూతులను అందించాడు. Beo -wulf (2000) వంటి Anglo-saxon రచనలను కూడా అనువాదం చేశాడు. సాహితీరంగంలో ఆయన చేసిన కృషికి గాను 1995 నోబెల్ సాహిత్య బహుమతి ఆయనను వరించింది!

తవ్వకం!

నా చూపుడు వేలికీ-బొటనవేలికీ మధ్య
కలం ఒకటి చతికిలబడి సేద తీరుతుంటుంది
తుపాకీలా రాజసంగా!
నేను నిల్చున్న కప్పు కిటికీ దిగువన
ఓ చక్కని చిరాకెత్తించే చప్పుడు
మొరం తేలిన నేలపై గడ్డపారను దిగేస్తూ
మా నాయిన తవ్వుతున్నప్పటి అలజడి
నేను తలవంచి కిందికి చూశాను..
పూల పాన్పుల నడుమ శ్రమలో
అతని వెన్ను వంగిపోయి
ఇరువై ఏండ్లకు ఆవల ఆలుగడ్డల తోటల గుండా
అతను దీక్షగా తవ్వుతున్న చోట
లయాత్మకంగా ముందుకు వాలిపోయి..
మురిపెంగా చుట్టుకున్న
ముతక బూట్లను భారంగా లాగుతూ
మోకాలుకు అభిముఖంగా నేలను తన్ని పట్టి
ఎత్తయిన మట్టి కొండలను దృఢంగా పెకిలిస్తూ
వెలుగులీనే అంచుల లోతులలో కప్పి పెడుతుంటాడు
మా చేతులు స్పృశించినప్పటి శీతల కాఠిన్యాన్ని అనుభూతిస్తూ
మేం ఏరి పెట్టిన కొత్త ఆలుగడ్డలను విత్తనాలుగా వెదజల్లుతూ..
దేవుడి దయ అపారంగా ఉందేమో,
ఆ వృద్ధుడు చేతిపారను అవలీలగా వాడుతున్నాడు
తన ముందు తరాల వారంత సునాయాసంగా, నైపుణ్యంగా..!
నిజానికి, ఒక్కరోజులో మా తాత
అదే బురద భూమి నుంచి
అందరికన్నా ఎక్కువ గడ్డినే కోస్తాడు!
ఒకసారి నేను కాగితంతో మూతి బిగించిన సీసాలో
అతని కోసం పొలానికి పాలను తీసుకెళ్లాను
వాటిని తాగడానికి దాన్ని పైకెత్తాడు
కాలు పట్టుజారి పడిపోయి
గుబురుగా ఉన్న పచ్చికలో-బురదలో
భుజాల కంటా కూరుకుపోయినా
మేట వేసిన పచ్చిక కోసం తవ్వకం ఆపలేదు!
ఆలుగడ్డల చల్లని వాసన
క్రమంగా కృంగిపోయి కురచనైన కాయగూరల ఎరువు
నేల కొసల దాకా కటువైన కోతలు
నా మస్తిష్కంలో వేళ్ళుగా సజీవమై విస్తరిస్తాయి
కానీ, నా పూర్వీకుల లాగా నా దగ్గర చేతిపార ఏదీ లేదు
తవ్వకాన్ని కొనసాగించడానికి..
నా చేతి చూపుడు వేలికీ-బొటన వేలికీ మధ్య
చైతన్యవంతమైన కలం మాత్రమే ఉంది
ఇప్పుడిక, దాంతోనే
వాళ్లు ఆపిన చోటు నుంచి తవ్వకాన్ని ఆరంభిస్తాను...!

-మూలం: సీమస్ హీనీ
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

160
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles