బతుకుకు భరోసా


Mon,April 15, 2019 12:28 AM

Bhathuku-ku-bharosa
చలి పొద్దు మీద సూర్యోదయాన్ని ఎత్తుకొని
వడివడిగా నడకను పక్షుల కూతలపై ఆరేస్తాను
ఇన్నాళ్ల కష్టం పంటై కళ్ళల్లో మెరుస్తుంటే
నాలో ఆశల గోరువంకలు ఎగురుతున్నాయి
వేరుశెనగ పంట గదా.. ఏ పిట్ట ఎక్కడ కొరుకుతుందో
అల్లరి పక్షుల మూకలకి నేను నలుమూలలా పరుగెత్తాల్సిందే
కాసేపు మంచె మీద వాయిద్యమై
డబ్బా డప్పుతో దుముకుతుంటాను..
శబ్దమెంత కఠోరమైన గానీ
పక్షులకి పంట చిక్కుకుంటే చాలు
అడవి పందులకి దక్కకుంటే చాలు
కొన్ని నెలల చెమట ధార
ఆనంద ప్రవాహమై తిరిగొస్తుంది..!
ఎండ ముంచుతున్నపుడూ
మబ్బులు చీకట్లను దులుపుతున్నపుడూ
నా కళ్ళు ఆకాశంలో సంచరిస్తున్నపుడూ
ఆకాశం నా పంటపై వాలుతున్నపుడూ
ఈ ఒంటరి సమయంలో కూడా
మంచె మీద ఈ రైతు అనగా అనగా.. ఒక నేను
ఆకాశాన్ని మోస్తూ ..
సూర్యోదయాల్నీ.. సూర్యాస్తమయాల్నీ..
నాలో నింపుకుంటూ.. నిలుపుకుంటూ..
అరిచే కీచురాళ్ళ మధ్య
రేపటి బతుకు భరోసాగా ప్రకాశిస్తాను...

- గవిడి శ్రీనివాస్, 99665 50601

204
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles