కాలం అతని వెంట ఒక కుక్కపిల్ల


Mon,April 8, 2019 12:00 AM

single-Man
ఔను.. అతను ఎప్పుడూ ఒక్కడే బయల్దేరుతాడు ఒంటరిగా
ఒంటరి సూర్యుని వలె
ఒంటరి తాటిచెట్టులా నిలబడి
పాదాలకింది భూమినీ, పై కప్పు ఆకాశాన్నీ చూస్తాడు
చుట్టూ ఎనిమిది దిక్కులు
దేశమేమో భుజంపై గగనమెత్తు జెండా ఐ
ప్రశ్నిస్తూంటుంది.. జీవితం చెట్టు కొమ్మపై పిట్ట కదా అని..
ఆ ఒక్కడు మందలు మందలుగా గడ్డి మేస్తున్న గొర్రెలను చూస్తూనే
నిర్వ్యాపకంగా సముద్రంలో కలుస్తున్న నదులనూ..
మట్టి కడుపులో నిక్షిప్తమై ఉన్న కాంతికడలినీ..
చొరబడి ప్రవేశించవలసిన నీళ్ళకోసం నోళ్ళు చాచిన పొలాలనూ..
చూస్తున్నపుడు/చటుక్కున వర్షం కురుస్తుంది
చినుకుల్లో స్నానించే అడవి చెట్ల ఆకులు
మొలకలు మొలకలుగా అతనిలో తుపాకులై మొలకెత్తి
చుట్టూ ఉన్న గోడలను ధ్వంసిస్తూండగా
అతను శతాబ్దాల బానిస ఆలోచనలను భూస్థాపితం చేసి
రెండు చేతులతో పర్వతాలను తలుపులవలె పక్కకు జరుపుకుంటూ
ఒక కొత్త దృష్టితో, కొత్త చూపుతో, కొత్త ఆలోచనలతో
కాలం వాకిట ఒక ప్రశ్న ను పాతుతాడు
ఎందుకిలా ఉంది ఈ దేశం అని
ఎవడో దశాబ్దాలుగా ప్రజలను మాయలో మత్తులో
సమాధి చేస్తున్నట్టు అర్థమౌతుంది కుట్ర
అప్పుడు బిగించిన పిడికిలితో ఒక పొలికేకై గర్జిస్తాడతను
దేశం దద్దరిల్లి పెనునిద్దుర వదలి ఉలిక్కిపడ్తూండగా
అతను ఒంటరిగానే భుజంపై జెండాతో జైత్రయాత్రను ఆరంభిస్తాడు
ఔను.. మనిషి తనను తాను
ఒక మహామానవునిగా గుర్తించుకుంటూ..
ఇసుక మేటను తోడినప్పుడు నీరూరుతుందనే రహస్యాన్ని తెలుసుకుంటూ
జ్ఞాన సరస్సువంటి శిరస్సును పైకెత్తి
అడుగులను ఆయుధాలుగా సంధించగానే
మేఘాలు, పక్షులు, వర్షాలు, అరణ్యాలు, వసంతాలు వెంటవస్తూన్నపుడు
అతను అతి సనాతనుడు.. అత్యాధునికుడు...
కాలాన్నితనవెంట కుక్కపిల్లవలె నడిపించుకుని వెళ్తున్న ఋషి.. ...
- రామా చంద్రమౌళి,93901 09993

158
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles