ఒమేరో ఆరిడ్జిస్


Mon,March 25, 2019 01:37 AM

homero-aridjis
మెక్సికో దేశ జీవితాన్ని, ప్రజల ఆకాంక్షలను, సాంస్కృతిక పరిణామాలను తన రచనలలో ప్రతిబింబించి, మెక్సికో దేశపు మరో కోణాన్ని ప్రపంచానికి సాక్షాత్కరింపజేసిన కవి, నవలా రచయిత, జర్నలిస్ట్, పర్యావరణ కార్యకర్త, దౌత్యవేత్త ఒమేరో ఆరిడ్జిస్! తండ్రి గ్రీక్, తల్లి మెక్సికన్ కావడం వల్ల, ఒమేరోకు చిన్ననాటి నుంచే విశాల ప్రాపంచిక దృక్పథం అలవడింది. ఆయనలోని నిరంతర అధ్యయనశీలత, ఆయన కవిత్వంలో తాత్త్విక ప్రాతిపదికను రూపొందించింది.
కవి నిత్యా క్రియాశీలిగా ఉండాలని నమ్మిన ఆయన ఎన్నో ప్రజా హక్కుల చైతన్య ఉద్యమాలకు అంకురార్పణ చేశారు. మెక్సికోలో, లాటిన్ అమెరికాలో పర్యావరణ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ Gabriela Garcia Marquez వంటి రచయితలూ, మేధావులతో కలిసి Group of 100 పేరుతో ఒక సంఘాన్ని స్థాపించాడు. ఎన్నెన్నో విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పిన ఒమేరో Netherlands, Switzerland, Unescoలలో మెక్సికో దేశ రాయబారిగా పనిచేశాడు.
మెక్సికోలో 1981లో, 1982లో, 1987లో International Poetry Festivalsను నిర్వహించి, అంతర్జాతీయ కవితోత్సవాల కు బలమైన పునాదులు ఏర్పరిచారు. ప్రఖ్యాత అంతర్జాతీయ రచయితల సంఘం, PEN Internationalకు 1997 నుంచి 2003 వరకు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు.
ఒమేరో కవిత్వం, స్పానిష్ భాషలో దాదాపు 40 సంపుటాలుగా ప్రచురితం కాగా, వాటిలో కొన్ని ఇంగ్లీషులో కూడా అనువాదమ య్యాయి. వాటిలో Blue Spaces, Exaltation of Light, Eyes to See Otherwise, Solar Poems, Time of Angels వంటివి ప్రముఖంగా ప్రస్తావించదగినవి.

రాత్రి కురిసిన వాన!

ఈ రాత్రి వేళ
వర్షం కురుస్తూ ఉంది
పాత ఇంటి కప్పుల మీద
బురదమయమైన వీధుల మీద!
నల్లని కొండల మీద
మృత నగరాల్లోని ఆలయాల మీద
వాన పడుతూనే ఉంది!
ఈ నిశీధిలో నేను విన్నాను
వర్షపు పూర్వీకుల సంగీతాన్ని
దాని ప్రాచీన అడుగుల సవ్వడిని
దాని కరిగిపోయే స్వరాన్ని
పురుషుల స్వప్నాల కన్నా వేగంగా
గాలి సందులలోంచి వర్షం
చినుకుల దారిని వేస్తోంది
మనిషి పాదాల అడుగుల కన్నా పొడువుగా
ధూళికణాల గుండా
చినుకు జాడలను ముద్రిస్తోంది
రేపు మనం మరణిస్తాం
కనీసం రెండు సాైర్లెనా...
వ్యక్తులుగా ఒకసారి
జీవ జాతిగా ఇంకోసారి!
ఉరుములు మెరుపుల మధ్య వ్యవధిలోనూ
తెల్లని విత్తనాలు
నీడల్లో ఛిన్నాభిన్నమైన క్షణాల్లోనూ...
అప్పుడు,
సంపూర్ణంగా ఆత్మపరీక్ష చేసుకొని
మానవజాతి గాథను వినిపించటానికి
సమయం ఆసన్నమవుతుంది.
ప్రస్తుతం వర్షం కురుస్తోంది
బహుశా ఈ రాత్రంతా కురుస్తూనే ఉంటుంది
తడిదేరిన వీధులలోనూ
నల్లని కొండ మీదానూ...
విషాదమేంటంటే..
వర్షపు చినుకుల చిరు సవ్వడిని ఆస్వాదించటానికి
ఇక్కడ ఒక్కరంటే ఒక్కరైనా లేరు..!!
మూలం: ఒమేరో ఆరిడ్జిస్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

264
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles