మనకాలపు మహాద్భుతాలు


Mon,March 25, 2019 01:37 AM

Kaleshwaram-wonders
తొలిదశ తెలంగాణోద్యమంలో
ఊహలకు రెక్కలు తొడుక్కుంటూ
హైదరాబాద్ పాతనగర వీధుల్లో
పాటలు పాడుకున్న ప్రభాత గీతాలమయ్యాం
జై తెలంగాణ నినాదంతో ఎత్తిన పిడికిళ్ళమయ్యాం
గోడలమీద రాతలమయ్యాం
ఊరేగింపుల్లో నినాదాలమయ్యాం
పారగుర్తులు పట్టుకుని ప్రతిధ్వనించాం
ఎన్నికల్లో విజయం తప్ప
ఎన్నో కలలుగన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం సాధించుకోలేకపోయాం
నాయకుల స్వార్థపరత్వానికి
మోసపోయామని అర్థమయ్యేసరికి
గాఢమైన నిట్టూర్పులమయ్యాం - నిర్వేద గీతాలమయ్యాం
అది ఆరంభం మాత్రమే
అప్పట్నుంచి వరుస పరాజయాలను చవిచూసిన తరానికి ప్రతినిధులమయ్యాం
రూపాయికే కిలోబియ్యం నినాదమే మిగిలింది
దొంగ నిల్వల వెలికితీత ఒక వారం వార్తయ్యింది
విద్యుత్ ఉద్యమం ఒక నల్లని నెత్తుటి మరకగా నిలిచింది
భూపోరాటం నెరవేరని సుదీర్ఘ స్వప్నోద్యమమయింది
అయినా ఎదలో ఒక మూల ఏదో ఒక ఆశ
హమారే మాంగే లేకే రహేంగే -
వివిధ జీవనరంగాల్లో స్థిరపడినా
ప్రజల పోరాటాలతో మమేకం
శ్రామిక జీవన సంగ్రామాలకు సంఘీభావం -
ఉన్నట్లుండి ఒక మెరుపు మెరిసింది
ఒక ఉరుము ఉరిమింది
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో
ఒక మహానాయకుడి పోరాటపటిమ
ప్రత్యర్థుల కుట్రలను కుయుక్తులను వమ్ము చేయగల
వ్యూహ, ప్రతివ్యూహాలు
ఉద్యమాన్ని రగిలించే అపూర్వమైన ఎత్తుగడలు
ప్రజల చైతన్యస్థాయికి తగిన ప్రతిపాదిత పోరాట రూపాలు
ప్రాణాన్ని ఫణంగా పెట్టి సాగించిన మహాదీక్ష
కోట్లాది ప్రజల అరవై ఏళ్ళ స్వప్నం
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన సుసాధ్యం
మా తరం కళ్ళారా చూసిన తొలి అద్భుత విజయం -
అక్కడితో ఆగకుండా కోటి ఎకరాలకు నీళ్ళందించే
అపర భగీరథుడి అద్వితీయ సంకల్పం
ఒక దార్శనికుడి దీర్ఘదృష్టి
భూమి గర్భాన్ని తొలిచి
జల సౌధాన్ని నిర్మిస్తూ నిర్దేశిస్తూ
ప్రవాహ మార్గాన్ని ప్రజల దారికి మళ్ళించే
మానవ మేధోశక్తికి మహోన్నత సంకేతం
వేలాది శ్రమజీవుల కఠోరశ్రమకు నిలువెత్తు సంతకం
నదుల అనుసంధాన జనిత జల సంగీతం
మన కాలపు మహాద్భుతం కాళేశ్వరం ... కాళేశ్వరం
భావికాలాన్ని బంగారుమయం చేసే ఊహాతీత జలేశ్వరం
- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

161
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles