జార్గోస్ సెఫెరిస్


Mon,March 11, 2019 12:33 AM

(1900, మార్చి 13- 1971, సెప్టెంబర్ 20)
giorgors
ఆసియా మైనర్ (ప్రస్తుత టర్కీ)లోని స్త్మ్రర్ని నగరంలో జన్మించి, ఎథెన్స్‌లోని ప్రఖ్యాత జిమ్నాజియంలో విద్యను అభ్యసించి, 1918లో తన కుటుంబంతో పాటుగా ప్యారిస్‌కు వలస వెళ్లి అక్కడే న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగి, ఆ తర్వాత 1963లో నోబెల్ సాహిత్య బహుమతిని సాధించేంతగా సాహితీ కృషిచేసిన గ్రీకు కవి దిగ్గజం జార్గోస్ సెఫిరియాడిస్..!
గ్రీకు దేశపు విదేశీ వ్యవహారాల ప్రతినిధిగా, దౌత్యవేత్తగా, రాయబారిగా సుదీర్ఘకాలం ఇంగ్లాండ్ (1931-34), అల్బేనియా (1936-38), అంకారా (1948-50), లండన్ (1951-53), యునైటెడ్ కింగ్‌డమ్ (1957-61) వంటి వివిధ ప్రపంచ నగరా లు, దేశాల్లో పనిచేసిన అనుభవం, ఆయన సాహితీ సృష్టికి ఎంతగానో తోడ్పడింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో మాతృదేశం గ్రీస్ నుంచి పారిపోయి ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, ఇటలీలలో గడిపినప్పటి ప్రవాసపు అనుభవాలు, విస్తృత ప్రపంచ పర్యటనలు ఆయన కవిత్వంలో ఎవరూ చూడని లోతులు ఆవిష్కరణకు కారణమయ్యాయి. గ్రీకు ఇతిహాసాలైన ఇలియడ్, ఒడిస్సీలచే తీవ్రంగా ప్రభావితమైన జార్గోస్ తన కవిత్వంలో వాటి తాలూకు ప్రాచీనతతో పాటు, అత్యాధునిక ప్రపంచపు పరాయీకరణను, మానవీయ విధ్వంసాన్ని ప్రతిభావంతమైన ప్రతీకలతో ప్రదర్శించారు.
Strophe (1930), The Cistern (1932), Mythistorema (1935), Book of Exercises (1940), Thrush (1947), Log Book I, II, III , Three Secret Poems (1966) వంటి కావ్యాలను ప్రచురించిన జార్గొస్ TS Eliot The Waste Land వంటి కావ్యాలను కూడా గ్రీకులోకి అనువదించాడు. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో జార్గోస్ రాసిన కవితా పంక్తులను పాటగా కంపోజ్ చేసి వాడుకోవటం విశేషం!

ఆనందానికి ఓ విరామం!

ఆనాటి శుభోదయ సమయాన
మనం ఎంతో ఆనందంగా ఉన్నాం!
దేవుడా! మహదానందం కదా అది!
మొదట..
రాళ్లు, ఆకులు, పువ్వులు మిరుమిట్లు గొలిపాయి
ఆ తర్వాత సూర్యుడు కూడా
చుట్టూ ముళ్ళ కిరణాలతో
ఎక్కడో స్వర్గంలోని సమున్నత ఎత్తుల్లో
జ్వాలా దీపాలను వెలిగించాడు
ఓ అజ్ఞాత వన దేవత ఎవరో
మన అనురాగాలన్నిటినీ మూటగట్టి
కొమ్మలకు వేళ్ళాడదీసింది
జుదా చెట్ల వనంలో...
Cupidలు, Satyrలు
ఆనంద పరవశులై ఆడుతూ పాడుతూ ఉన్నారు
యవ్వన ప్రాయపు పిల్లల శరీరాలు
గాయాలతో ఎర్రబారిన మోచేతులు, మోకాళ్లు
గుబురు పొదల మాటున
తటిల్లున మెరుస్తున్నాయి
అయినా, ఆ ఉదయ సమయమంతా
మనం ఎంతో సంబరంగా ఉన్నాం!
అక్కడ కనిపిస్తున్న అగాథం ఓ మూతబడ్డ బావి
దానిమీద Faun లేలేత పాద ముద్రలు
ఇంకా చెరిగి పోలేదు
దాని నవ్వు నీకు గుర్తుందా?
అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాం మనం?
సరిగ్గా అప్పుడే..
మబ్బులు వర్షించాయి
నేలని చిత్తడి చేశాయి
గుడిసెలోకి వంగివెళ్తూ
అర్థాంతరంగా నువ్వు నవ్వును ఆపుకున్నావు
నీ విశాల నయనాలను విప్పార్చి తదేకంగా చూశావు
బీభత్స ఖడ్గాన్ని ధరించిన ఓ మహా దేవత
మహోధృతంగా దర్శనమిచ్చింది
అప్పుడు నువ్వన్నావ్
దీన్ని నేను చెప్పలేను
ఈ స్థితిని నేను వర్ణించలేనని.
ఈ విశ్వ సంచారంలో
అర్థం చేసుకోవటానికి వీలుకాని మనుషులు
ఎందరో నాకు ఎదురయ్యారు
ఐనా,
వాళ్లు ఎన్ని రంగులతో క్రీడించినా
మరెన్ని వర్ణాలను పులుముకున్నా
వాళ్లందరి అసలు రంగు మాత్రం నలుపే
వాళ్లందరి అసలు స్వరం మాత్రం మట్టి పిలుపే..!
-మూలం: జార్గోస్ సెఫెరిస్
-స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

226
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles