యుద్ధక్షేత్రంలో రక్త సంతకం!


Mon,March 11, 2019 12:29 AM

ఇప్పటివరకూ మనం మేఘాలు వానల్ని కురిపించడం చూసాం
ఇప్పుడవి రక్తాన్ని కూడా వర్షించటం చూస్తున్నాం!అవును,
మనుషుల్లోని ద్వేషాలు
గాలిలోకి వ్యాపించి ఆకాశాన్ని సైతం ఆక్రమించాయి కదా..!
ఇప్పటివరకూ మనం
తెల్లపావురాలు గాలిలోకి ఎగరటం చూసాం
ఇప్పుడవి పోరాటం ప్రకటించటాన్ని చూస్తున్నాం!
అవును,
తనలోని సహనాన్ని ఎదుటి వాళ్ళు కవ్వించి
తన జాతి ఉనికికే ప్రమాదం తెచ్చాయి కదా..!
ఇప్పటివరకూ మనుషులు
ఉగ్ర కత్తులతో కుత్తుకలు కోసిన తీరును చూసాం
ఇప్పుడు తీవ్రవాద అంతానికి
ప్రతీకారం సమాధానం కావడాన్ని చూస్తున్నాం!
అవును,
తిరుగు దాడులు - సర్జికల్ స్ట్రైక్‌లు- యుద్ధాలు మాత్రమే
యుద్ధాన్ని అంతం చేసాయి కదా..
ఇప్పటివరకూ దేశాలు
ముళ్ల కంచెలని నిర్మించుకోవడం చూసాం
ఇప్పుడు సరిహద్దులు సైతం
సైనికుల తలల్ని తెగేస్తున్న తీరును చూస్తున్నాం!
అవును,
హద్దుల వెంట ఆకుపచ్చని గడ్డి కూడా మొలవక
దేశాల మనో క్షేత్రంలో
మానవతా బీజాలు ఎదగకపోయాయి కదా..
ఇప్పటివరకూ మనకు తెల్సిన శాంతి మార్గాలు
సంఝౌతాలు- వాఘా రహదారులు- ఫ్రెండ్లీ మ్యాచ్‌లు
సంగీత కచేరీలు- ద్వైపాక్షిక చర్చలు..
ఇప్పుడు- నిఘాలు, నిత్య అనుమానాగ్నులు
అంతర్గత కల్లోలానికి కుట్రల రచనలు చూస్తున్నాం..
అవును, మిరాజ్ ని మిరాజ్ తోనే ఎదుర్కోవాలని
యుధ్ధ భయమే ప్రభుత్వాలని నిలువరిస్తుందని
యుద్ధం మాత్రమే శాంతిని సాధిస్తుందని తెలిసింది కదా..
ఇప్పటివరకూ మనం
కుందేలు పిల్లలు
వేటగాడికి దాసోహం అవటాన్ని చూసాం
ఇప్పుడు మాత్రం,
ఇనుప బూట్లతో తొక్కేసినా
ఇసుమంత రహస్యాన్ని చెప్పని తెగువని చూస్తున్నాం!
అవును, తన దేశం ముందు
తన ప్రాణం ఇసుక రేణువంత అని
దేశం మీసం మెలేసేందుకు
తన మౌనమే ఆయుధమని గుర్తించారు కదా..
అవును, మహాభారతంలో అభిమన్యులు
నవభారతంలో అభినందన్‌లు ఉంటారని తెలిసింది కదా..
- శ్రీలక్ష్మి ఐనంపూడి, 99899 28562

167
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles