ప్రపంచ కవిత


Sun,March 3, 2019 11:48 PM

-మాయా ఎంజెలో (1928 ఏప్రిల్ 4- 2014 మే 28)
ఎనిమిదవ ఏటనే లైంగిక దాడికి గురై ఆ తర్వాత ఎన్నో ఏండ్లు మౌనంగా ఉండి, తన జీవితాన్ని మళ్లీ తానే నిర్మించుకున్న అమెరికన్ కవి, రచయిత్రి, జర్నలిస్ట్, పౌరహక్కుల నేత, నటి, సినీ దర్శకురాలు- మాయా ఎంజె లో. సెయింట్ లూయిస్ ప్రాంతంలో జన్మించిన మాయా అసలు పేరు మార్గరెట్ ఆనీ జాన్సన్! తన 12వ యేటనే తల్లితో పాటు శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి వలస వెళ్లి, అక్కడ హోటల్ వెయిటర్‌గా, వేశ్యగా, వంటగత్తెగా, బార్ డాన్సర్‌గా వివిధరకాల పనులు చేసింది. బార్ డాన్సర్‌గా ఉన్నప్పుడు ఆమె మారుపేరైన మాయా ఎంజెలోనే ఆ తర్వాత ఆమె పేరుగా స్థిరపడిపోయింది. నాటకాలలో నటిగా యూరప్, ఆఫ్రికాలలో పర్యటించిన ఆమె, ఈజిప్ట్, ఘనా దేశాలలో పత్రికా జర్నలిస్ట్‌గా కూడా పని చేసింది.
Alex Haley రాసిన Roots నవల ఆధారంగా 1977లో తీసిన టీవీ సీరియల్‌లో, మరెన్నో టీవీ కార్యక్రమాల్లో నటించిన మాయా, అమెరికాలో ఆఫ్రికన్ జీవన సాంస్కృతిక విశిష్టతను వ్యాప్తి చేయటంలో గణనీయ కృషి చేసింది. Down in the Delta (1998) సినిమాతో దర్శకురాలిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నది.
బాల్యం నాటి తన విషాద అనుభవాలను I know why the Caged Bird Sings (1969)పేరుతో తన స్వీయచరిత్రగా రాసింది. ఇది పెద్ద సంచలనం సృష్టించడంతో ,ఆ తర్వాత ఆమె తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలకు అక్షర రూపమిస్తూ Gather Together in My Name(1974), The Heart of a Woman (1981), All Gods Children Need Travelling shoes (1986) వంటి ఎన్నో స్వీయ చరిత్రలను ప్రచురించింది. అలాగే కవయిత్రిగా ఆమె రాసిన ప్రతీ కవితా ఓ స్టేట్‌మెంట్‌లానే నిలిచిపోయిందని చెప్పా లి. Still I Rise(1978), Now Sheba Sings the Song (1987), I shall Not be Moved (1990)వంటి కావ్యాలు ఆమె ధిక్కార స్వరానికి, స్త్రీ గా, నల్ల జాతీయులురాలిగా ఆమె ఆక్రోశానికి, ఆగ్రహానికి ఆనవాళ్లు!
ఆడాళ్ళ పని!
తూరుపు కిరణాలతో పాటే
నేను పిల్లల్ని లాలించాలి
బట్టల్ని ఉతికి, ఆరేసి, మడతెయ్యాలి
మరకలేవీ లేకుండా నేలను తుడువాలి
ఆహారసామాగ్రిని దుకాణం నుంచి తేవాలి
ఆ తర్వాత కోడి కూరకు వేపుడు పెట్టాలి.
మూత్రం పోసుకున్న చిన్నారిబిడ్డకు స్నానం చేయించాలి
ఉగ్గు తినిపించడంలోనే నా కాలమంతా ఆవిరి అవుతుంది
అంతేనా..,
ఇంకా కలుపు తీయాల్సిన తోట ఒకటుంది
ఇస్త్రీ చెయ్యాల్సిన అంగీలున్నాయి
బట్టలు తొడగాల్సిన పిల్లలు
కత్తిరించాల్సిన పొదలు ఉన్నాయి.
ఇంకా..ఈ కుటీరాన్ని మొత్తం బూజు దులుపాలి
గది గదినీ శుభ్రం చెయ్యాలి
మంచాన పడి ఉన్న
నా వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవాలి
ఇన్ని చేసిన తర్వాత కూడా
పొలానికెళ్ళి పత్తిని ఏరుకోవాలి..

సూర్యరశ్మి నా మీద ప్రసరించనీ
జోరు వర్షం నా మీద కురవనీ
మంచు బిందువులు సున్నితంగా జారనీ
నా నుదురును మళ్లీ చల్ల బరచనీ..

ఓ విరుచుకు పడ్డ తుఫానూ..!
నీ భీకరమైన గాలులతో
నన్ను ఈచోటు నుండి దూరంగా విసిరెయ్యి
ఆకాశంలోకి ఎగిరి తేలిపోయేలా..
కనీసం, అప్పుడైనా నాకు విశ్రాంతి దొరుకుతుందేమో..!

సుతారంగా కురుస్తున్న హిమ వర్షమా..!
నన్ను నీ తెల్లని మంచుతో కప్పెయ్యి
చల్లని ముద్దులతో గడ్డకట్టి పోయేలా..
కనీసం, ఈ రాత్రి అయినా నాకు విరామం లభిస్తుందేమో..!

ఇక నాకు మిగిలేవల్లా
సూర్యుడు, వర్షం, వంగిపోయిన ఆకాశం..
పర్వతాలు, సముద్రాలు, పచ్చని ఆకులు, కఠిన శిలలు
తారల తళుకు, వెన్నెల వెలుగు...
నేను.. అంతేనా..!
మూలం: మాయా ఏంజెలో
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 8008005231

326
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles