నీ ధ్యాస లేనోళ్ళం


Sun,March 3, 2019 11:47 PM

చిలికిన నీ వెచ్చటి నెత్తురు
మన ఊరి మట్టితో కలసి
ఊరు ఊరంతా కన్నీరై పారింది

నీకోసం గంపెడాశతో ఎదురుచూస్తున్న
పాత పెంకుటిల్లు మధ్యలో రెండు వృద్ధ చక్షువులు
తడారిన చెలిమలయ్యాయి

నీ అరచేయిని మోసిన దోస్తుల భుజాలు
దిగాలుపడ్డ మోడులై చూస్తున్నయ్

దేశరక్షణ బాధ్యతో .. దహించే ఆకలి అవసరమో..
నిన్ను మాకు రక్షకునిగా చేసింది

మేము సవాలక్ష సుఖవినోదాల
తీరికలేని గానుగెద్దులం

దేశ కనురెప్పవయ్యి నిత్యం కళ్ళలో వత్తులేసుకున్న
నీ ధ్యాస లేనోళ్ళం..

నీ రక్తపు తడి మా గుండెలపై చిలికినప్పుడల్లా
మేం సిద్ధంచేసి ఉంచుకున్న రెడీమేడ్ దేశభక్తిని
మైకుల్లోంచి మీడియాల్లోంచి వరదై పారిస్తం

కొన్ని వీర గీతాలను శత్రు నిర్మూలనా భీరాలను
ఇంకొన్ని కొవ్వొత్తుల మైనపు వెలుగుల
విశాద నీడలనూ ఊరేగిస్తం..

వీలైతే జ్ఞానరహిత కవుల పడికట్టు పద్యాలలో
నీ త్యాగనిరతిని కీర్తిస్తం

నిన్ను ఎగేసి ఎగేసి మా భయాలమాటునున్న
పిరికి మొఖాన్ని అందమైన దేశభక్తి మాస్క్ తో
మేనేజ్ చేసుకుంటం

ఆయుధాల అందమైన పేర్లుతప్ప
ఆయుధ వ్యాపరపు బిజినెస్ స్కూల్ పాఠాలు తెలియనోడివి
బోఫోర్స్,రాఫెల్ కుంభకోణాల చీకటి కోణాలనెరగనోడివి

నీ శవపేటికలు నాయకుల మార్కెట్ సరుకుల లాభాల
ముడుపుల వనరులని తెలియనోడివి

రక్షించడమొక్కటే జీవితాన్ని చేసుకున్న వాడివి

ఏ శాంతి మంత్రాన్ని ఈ భూమ్మీద నాటి
యుద్ద పిశాచుల కీరాతక సందేశాల నుండి
నిన్ను రక్షించుకోగలను..!

నీ కోసం.. నిశ్శబ్ద దుఃఖమై వాడిపోవడం తప్ప
బండరాళ్ళకు గులాబీలను ఎలాపూయించగలను..!!
- చెమన్, 9440385563


225
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles