యుద్ధం చేద్దాం, కానీ...


Sun,March 3, 2019 11:47 PM

నిజమే.. యుద్ధం చేద్దాం
యుద్ధం చేయవలసిందే
సాహసం చూపవలసిందే
అవును..
తుమ్మితే ఊడిపోయే ముక్కును
ఎన్నాళ్లని భరిస్తాం..?
అటో ఇటో, తాడో పేడో తేల్చేద్దాం
దేనికోసమైతేనేం.. యుద్ధం యుద్ధమే
కురుక్షేత్రం సంసిద్ధంగా ఉన్నది
ఆయుధాలు కూడా మోహరించాయి
అయిదూళ్ల కోసమే అన్నట్టు
మహాభారత సంగ్రామం జరగలేదా?
ఇక, శంఖారావం పూరించడమే తరువాయి
భూలోక స్వర్గం కోసం
భారత ఉపఖండ దాయాదులు
రణరంగంలోకి దూకితే తప్పేంటి?
కచ్చితంగా.. ఇక నువ్వో నేనో తేలేలా
మహాయుద్ధం జరగవలసిందే
కానీ.. ఒక్క క్షణం...
ఎవరు కౌరవులు? ఎవరు పాండవులు?
కౌరవులెవరో.. పాండవులెవరో..
తేలకుండానే యుద్ధమా..!
ఎవరు ఎవరితో యుద్ధం చేయాలి?
ఎవరికి ఎవరితో వైరం?
ఇటు ప్రజలే.. అటు ప్రజలే..
వీరు సైనికులే.. వారూ సైనికులే..
ప్రజల కోసం, ప్రజలే పాలించుకుంటున్న
ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కదా
మందిరంలోనైనా, మశీదులోనైనా
ఉన్నది ఒక్కడే దేవుడు కదా!
నాలో ఉన్నది, నీలోనూ ఉన్నది
ఎర్రెర్రని రక్తమే అయినప్పుడు
ఇద్దరం కలిసి నాలుగు చేతులతో
ప్రేమ పావురాల్ని ఎగుర వేయలేమా..?
నిజమే.. నువ్వూ, నేనూ ఇద్దరం కలిసి
యుద్ధమే చేద్దాం..
కేవలం రాచపుండుపైన
రాకాసి నీతిపైన..!
-దోర్బల బాలశేఖరశర్మ 8096677410

194
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles