ఓ స్వప్నం!


Mon,February 25, 2019 01:09 AM

నేనో కల కన్నాను
కిటికీలోంచి దూకుతున్న సంజె కిరణాలలో
జ్ఞాపకాలను రాల్చుతున్న శిశిరాన్ని!
నిన్ను, తాగి మత్తెక్కిన విదూషకుడిని
ఫాల్కన్ మెడను బిగించి
కోయడానికి సిద్ధమైన నీ చేయిని
ఆ క్షణమే
నా పక్షి తిరిగొచ్చి
నీ చేయి మణికట్టు మీద వాలింది!
కాలం గడిచింది, పెద్దవాణ్నయ్యాను.
దాంతోపాటు చెవిటితనం కూడా వచ్చింది
నున్నని మంచు కరిగినట్టుగా
కుర్చీలపై అలంకరించిన
పాతపట్టు వస్త్రం చివికి చిరిగినట్టుగా
తోట నుంచి ఉబికివచ్చిన సూర్యాస్తమయం
అరుణ సెప్టెంబర్ రక్తాశ్రువులతో
అద్దాలకు రంగులు పూసింది!
ఈసారి కాలమే వయసు మళ్లింది
వినికిడితనం కోల్పోయింది
ప్రతిదానికి బిగ్గరగా అరిచే నువ్వేమో
హఠాత్తుగా పూర్తిగా నిశ్శబ్దమైపోయావు
ఈ నీరవ అశ్శబ్ద ప్రశాంతత
నాలోని నిమగ్నతను మంత్రముగ్ధతను భగ్నం చేసింది
తక్షణమే స్వప్న దృశ్య ప్రవాహం స్తంభించింది
అర్ధంతరంగా ఆగిన ఘంటానాదం
స్తబ్ధతనే సమాధానంగా అందించింది!
ఇప్పుడు నేను మేల్కొన్నాను
శిశిరంలా నిర్లిప్తంగా
వేకువ కూడా చిక్కగా చీకటిగా ఉంది
గడ్డిపోచల ప్రవాహంపై
పరుగెడుతున్న బండి ఉరవడి నుంచి మొదలై
ఆకాశరేఖను అందుకోవడానికి
ఉరకలేస్తున్న చెట్లను వెంటాడుతూ
ఓ బలమైన ఈదురుగాలి ఊర్థ్వంగా ఎగిసింది!!
మూలం: బోరిస్ పాస్టర్‌నాక్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

204
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles