ఆడ్రి లార్డ్


Mon,February 18, 2019 01:33 AM

(1934, ఫిబ్రవరి 18-1992,నవంబర్ 17)
Audre-lorde
తనని తాను లెస్బియన్‌గా, తల్లిగా, యోధురాలిగా, కవయిత్రిగా ప్రకటిం చుకున్న అమెరికన్ నల్లజాతి పౌర హక్కుల కార్యకర్త ఆడ్రి గెరాల్డిన్ లార్డి! వెస్టిండీస్ దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడిన కుటుంబంలో జన్మించిన ఆమె, తన బాల్యంలో భావ వ్యక్తీకరణ విషయంలో చాలా తడబడేది. దాన్ని అధిగమించడానికి ఆమె, ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా చదివి బట్టీ పట్టడమే కాక, సందర్భాను సారంగా వివిధ కవితల పంక్తులనే తన మాటలుగా చెప్పేది. తన 12వ ఏటనే కవిత్వాన్ని రాయడం ఆరంభించిన ఆడ్రి, ప్రఖ్యాత Seventeen మ్యాగజైన్‌లో తన తొలి కవితను ప్రచురించింది. ఆ తర్వాత ఆమె The First Cities (1968)తో మొదలు పెట్టి, Cables to Rage (1970), From A Land Where Other People Live (1972), Coal (1976), Between Ourselves (1976), Hanging Fire (1976), The Black Unicorn (1978) వంటి ఎన్నో కావ్యాలతో అమెరికన్ నల్లజాతి సాహి త్యంలో తనదైన ముద్రను వేసింది.

తన సైద్ధాంతిక నిబద్ధతకు జీవితాంతం కట్టుబడి ఉన్న ఆడ్రి, లెస్బియన్ హక్కుల కోసం వారి సమానస్థాయి కోసం పోరాడటమే గాక, వారి వాణిని వినిపించడానికి, వారి ప్రత్యేక జీవితాన్ని ఆస్వాదించడానికి తగిన సంస్థలను కూడా స్థాపించింది. ఆమె అభిమానులు, లెస్బియన్ కవిత్వాన్ని రాసిన వారి కోసం ఓ విశిష్ట పురస్కారాన్ని Audre Lorde Award పేరిట ఏర్పాటుచేసి 2001 నుంచి ప్రదానం చేస్తున్నారు!

girl

అగ్ని దహిత!

నాకు పధ్నాలుగేండ్లు
నా చర్మం నన్ను వంచన చేసింది
ఎవరి రహితంగా నేను జీవించలేనో
ఆ పిల్లగాడు
ఇప్పటికీ రహస్యంగానే
తన బొటన వేలును
నోట్లో పెట్టుకొని చీకుతుంటాడు
ఎల్లప్పుడూ నా మోకాళ్లు
ఎందుకనో
బూడిద కొట్టుకుపోయే ఉంటున్నాయి.
అవునూ, వేకువకు ముందే
నేను మరణిస్తే ఏమవుతుంది?
అయితే, ఇప్పుడు అమ్మ నిద్రలో ఉంది కదా
బెడ్‌రూమ్ తలుపులు మూసుకొని..
రేపటి వేడుక కోసం సకాలంలోనే
నేను నాట్యం నేర్చుకోవాల్సి ఉంది
నాకేమో ఈ గది చాలా ఇరుకుగా అనిపిస్తోంది
ఒకవేళ, గ్రాడ్యుయేషన్ పూర్తికావడానికి ముందే
నేను మరణిస్తే
వాళ్లంతా బృంద విషాదగీతాలను ఆలాపిస్తారు
కానీ అంతిమంగా
నా గురించిన సత్యాన్ని మాత్రం నువ్వు చెప్పు
నేను చేయదల్చుకున్నదేదీ ఇక్కడ లేదు
కానీ చేయాల్సింది మాత్రం ఎంతో, ఎక్కడో ఉంది
అయితే, అమ్మ నిద్రపోతూనే ఉంది కదా
బెడ్‌రూమ్ తలుపులు మూసుకొని..
నా పరంగా నేను ఆలోచించడాన్ని
నన్నెవరూ ఆపలేరు
నిజానికి నేను గణితం గుంపులో ఉండాల్సినదాన్ని.
అతనికన్నా నా మార్కులే ఎక్కువ
అలాంటప్పుడు
నేను రక్షకాలు ధరించిన దాన్నై
ఎందుకుండాలి?
రేపటికి
నేను ధరించదగినవేవీ నాకు లేవు
అలాంటప్పుడు, నేను కలకాలం జీవించాల్సింది
కేవలం ఎదుగడానికేనా?
అయితే, అమ్మ మాత్రం ఇంకా నిద్రిస్తూనే ఉంది
బెడ్‌రూమ్ తలుపులు మూసుకుని..
మూలం: ఆడ్రి లార్డ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

324
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles