యమునా తీరం


Mon,February 18, 2019 01:32 AM

నిశ్శబ్దం ఎంత తీయనిది!
వూపిరి చాలనం తప్ప ఏశబ్దం లేదు..
కలల ఒరిపిడిలో నీ మాటల
హిమబిందువుల స్పృశిస్తున్నా చూడు..
నాచుట్టూతా పరుచుకున్న పరవశపు విరిజాజులు
నీస్పర్శా గడియల్ని బంధిస్తున్నాను చూడు..
గుండె లయతప్పిన స్పందన తప్ప ఏమిలేని నిమిషం
నీవు చిలకరించే అనుభూతిలో ఆసాంతం నేనేనా!
నిశ్చలమైన నదిలాంటి నిన్ను
అలా చూస్తుండటమేనా! మోహమంటే...
నాస్వప్న వేదికలను అలంకరిస్తున్న
నీ అరమోడ్పు కన్నుల చూడడమేనా మోహమంటే...
నీ మాటలు చిక్కనిశీతల
స్పర్శ అయి తాకడమేకదా మోహమంటే...
ఈ దీపపుకెంజాయలో
ఇంద్రధనస్సు రంగుల ప్రసరిస్తున్న నీవు!
ఓడిన కాలాన్ని బంధిస్తూ వెన్నెల దారాల్ని
పెనవేస్తున్నావెందుకు?
అణువణువు శబ్దిస్తున్న నీ ధ్యాన ముద్రలోనేను
వెన్నెల గూటిలో నక్షిత్రపు దీపమేకదా
నీధ్యానమంటే..
నా కన్నుల్లో నుంచి హృదయంలోకి జాలువారుతూ నీవు...
ఎప్పటికి..ఇంకెప్పటికీ..
ప్రతివసంతంలో ఇగుర్లు వేస్తున్న చిరుగాలివై
తొలి చినుకుల మట్టిపరిమళమై
పుడమికి మేఘపరిష్వంగమై
ఎప్పటికీ.. ఇంకెప్పటికి..
నీ కన్నులలో పొదుగుకున్న వెలుగులో మునిగి
నీశ్వాస పరిమళంలో తడవడమేనా ధ్యానమంటే...
గమ్మత్తుగా వెన్నెల మళ్ళలో నీకళ్ళు
చిరువెలుగు తళుక్కుమంటూ
గమ్యాన్ని చూపుతున్నాయి చూడు..
వూగేకొమ్మలు చేతులు చాచి
నీభుజాలుగా సంకేతమిస్తున్నాయి చూడు..!
- సీహెచ్ ఉషారాణి

249
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles