ఏదైనా.. భర్పూర్‌గానే ఉండాలి!


Sun,January 27, 2019 11:57 PM

ఇదొక్కటే కాదు..,
ఈ వెన్నెల్లో కూర్చొని
ఇద్దరం కళ్లల్లో చూసుకోవడం
ఒకరిమీద ఒకరం పూలు చల్లుకొని
నవ్వుల్లో మునిగిపోవడం!
ప్రేమించుకోవడమంటే
మనుషుల్ని మరిచిపోయే
మత్తులాంటి పరవశాలేంకాదు
ఎన్నో గరుకు స్పర్శలు కూడా ఉంటాయి..!
ఈ ప్రయాణంలో ..
చిలువలు పలువలుగా
తెలియని మలుపులుంటాయి!
బాధ్యతలూ.. బరువులూ..
బంధాలూ.. బాంధవ్యాలూ..
కష్టాలూ, సుఖాలూ.. కన్నీళ్లూ, కనికరాలూ
ఆకలీ, దూపా.. సేవలూ, స్నేహాలూ
తోవలు, తుఫానులూ..
ఇవన్నీకూడా
నీకూ నాకూ సంబంధించినవే..!
ఇన్నిటినీ పట్టించుకోకుండా
పల్లకీలో తిరుగుతూ
కొలనులో నీడలు చూసుకోలేను
ఇంద్రధనుస్సు రంగుల చాటున
జీవితాన్ని మరిచిపోలేను
నేను మామూలు మనిషిని
సాదా సీదా ప్రేమికుణ్ణి
ఎవర్ని ఇష్టపడినా
ఏ కర్తవ్యాన్ని స్వీకరించినా
భర్పూర్ గానే ఉండాలనికొంటాను..!
- ఆశారాజు, 93923 02245
(భర్పూర్ అంటే సంపూర్ణంగా.
ఇక్కడ గుండెనిండా అని అర్థం)

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles