క్షణాల క్షణికం


Sun,January 27, 2019 11:57 PM

దుర్భేద్యమైన అహంకార కుడ్యాల నడుమ
ఏ అస్త్రమూ ఛేదించలేని ఉన్మాద ఛత్రాల నీడన
గోడలకు భేదంలేని సహస్ర నినాదాల మధ్య
నాదే ప్రపంచమని విర్రవీగే అజ్ఞాన తిమిరాల చెంత
ఎన్ని ప్రపంచాలు, ఎన్ని కంచెలు, ఎన్ని యుద్ధాలు..!
కాలం అనంత క్షణాల క్షణికం
దాని ఆది తెలియదు.. అంతు తెలియదు
కొలుస్తున్నామనుకుంటాం, జీవిస్తున్నామనుకోం
జయిస్తున్నామనుకుంటాం, క్షయిస్తున్నామనుకోం!
శాశ్వతమని పోతపోసిన వేనవేల కలలు
భళ్లున బద్దలవుతాయి
సర్వం నాదే అనుకున్నది.. మరుక్షణం
చిద్రుపలై కళ్లముందే కళ్లమవుతుంది
అజేయం అనుకున్నది అంతలోనే
క్షీణమై హీనమై అంతానికి చేరువవుతుంది!
కొండలు దూది పింజలయితే
దూది పింజలు కొండలు కావా!
భ్రమ బ్రహ్మరాక్షసిగా మారి
మనసును మాయ చేస్తోంది
కాలు నిలువనీయదు
కాలం మరువనీయదు
ఖాళీ సలుపుతున్నది..!
దేనికోసమో వెదుకుతూ ఉంటాం
కళ్ళముందు ఉన్నది చూడలేం
అవి ఎండమావులని తెలిసేసరికి
జీవితం గడప దాటిపోతుంది
కళ్ళు తెరిచే సరికి కాలం కనుమరుగవుతుంది
భయమూ అభయమూ గుర్తించలేని అసమర్థత
మార్మికత వాస్తవికతల అంతరం పసిగట్టలేని సందిగ్ధత..!!
- రాచకొండ సిద్ధార్థ

285
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles