ఒసిప్ మాండెల్ స్టామ్


Mon,January 21, 2019 01:55 AM

osip-mandelstam
(1891, జనవరి 14-1938, డిసెంబర్ 27)అప్పటి రష్యన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న వార్సా నగరంలో సంప న్న యూదు కుటుంబంలో జన్మించిన కవి, వ్యాసకర్త, ప్రజాహక్కు ల కార్యకర్త ఒసిప్ ఎమిలివీచ్ మాండెల్ స్టామ్! పారిస్, జర్మనీ, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఒసిప్ 1905లో తొలి రష్యన్ విప్లవ కాలంలో తన కవిత్వంతో ప్రజలను ఎంతో ఉత్తేజపరిచారు. కవులందరి తరపున ఓ ప్రజా మ్యానిఫెస్టోను 1913లో రాసి, విప్లవ రష్యన్ ప్రభుత్వానికి అందించారు. మొదట్లో ప్రభుత్వ అనుకూలంగా ఉన్నప్పటికీ, తర్వాత స్టాలిన్ విధానాలతో విభేదించి 1938లో మాస్కో వ్యతిరేక విధానాలను ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాడని, విప్లవ వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నాడనే ఆరోపణల మీద అరెస్టయ్యాడు. అలా ఐదేండ్ల పాటు జైలు జీవితం గడిపాడు. అయినా చివరివరకు అణిచివేతకు, నియంతృత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఒసిప్ సాహిత్యంలో స్వేచ్ఛా భావనలకు జయ పతాకగా నిలిచాడు.! The Stone (1913) కవితా సంకలనంతో మొదలెట్టి, Tristia (1922), On Poetry (1928), The Egyptian Stamp (1928) వంటి సాహితీ జగతి లో కొత్త ఆలోచనలకు దారులు వేశాడు.
నా అరచేతుల్లో నుంచి...!
ఒకింత ఆనందం కోసం
కాసింత సూర్యుడిని
కొంచెం తేనెను
నా అరచేతుల్లో నుంచి తీసుకో..
Persephone భ్రమరాలు ఆదేశించినట్టుగా!
ముడితీసి వదిలేశాక
పడవ ఇంకెప్పుడూ తీరంలో నిలవదు
తోలు-ఉన్ని నీడల్లో
ఏ సందేశమూ వినిపించదు
ఇదో చిక్కటి కారడవి జీవితం
భయాన్ని అధిగమించటం దుర్గమం!
ఇక ఇప్పుడు మన కోసం
కేవలం చుంబనాలు మాత్రమే మిగిలాయి
చిక్కటి ఉన్నిలాగా చిన్నారి తేనెటీగలు
తుట్టెని విడిచిన మరుక్షణం మరణిస్తాయి!
పారదర్శకంగా కనిపించే నిశిరాత్రి
అవి చిటపటల సవ్వడి చేస్తాయి
దట్టమైన టైగా చెట్లే వాటి ఇల్లు
అదే వాటి ఆహారం, పుదీనా,
వాటి సమయం, వాటి నిధి అన్నీనూ...
అందుకే నేనిస్తున్న
ఈ మోహపూరిత కానుకను
స్వీకరించు.. ఆస్వాదించు !
అవి తేనెటీగలే..
తేనెపట్టు చుట్టూ కంఠహారంలా
అల్లుకొని ప్రాణత్యాగం చేశాయి
అవి ఎండిపోయి నిర్జీవమయ్యాయి
అయితేనేం..
అవి సేకరించిన తేనెను మాత్రం
సూర్యుడిగా మార్చాయి!
మూలం: ఒసిప్ మాండెల్ స్టామ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles