ఆఫ్రికా...ఆఫ్రికా!


Mon,January 21, 2019 01:54 AM

AFRICA
ఆఫ్రికాకి చరిత్ర లేదని అన్నదెవరు?
మనిషికీ, మానవతకు పుట్టినిల్లది
ఆది మానవుడు అడుగులేసిన నేల
అగ్గిని తొలిసారిగ రాజేసిన నేల!
నైలునదీ జీవ జలాలు నడయాడిన బీళ్ళన్నీ
పచ్చని పంటలతో వసంత రాగం ఆలపిస్తాయి!
అంబరాన్నంటే పిరమిడ్లు
నిర్మాణ ప్రతిభకు నిలువెత్తు రూపాలమని నినదిస్తాయి!
కిలిమంజారో ఎక్కి చూడు
కనుచూపుమేర కమనీయ దృశ్యాలు
ఈజిప్టు చుట్టిరా ఓసారి
నాగరికతకది ఆనవాలు
ఐరోపా కన్ను తెరవకముందే
ఆఫ్రికా కంచును సృజించిన విజేత
పసిడి రాశుల్ని ప్రపంచానికి
అందించిన కనకగర్భ!
ఇనుమును ఇరుసుగా మార్చిన నిపుణ!
పశ్చిమాద్రి నుంచి వచ్చిన
మిడతలదండుకు చిక్కిన పరాధీన!
సామ్రాజ్యవాదం సమరనాదం చేసి
నీగ్రోవంటూ నీచంగా చూసినా
నీకు మనసే లేదన్నా
అసలు నువు మనిషివే కాదన్నా
బానిసని చేసినా
బజారులో అమ్మకానికి పెట్టినా
ఉక్కు పిడికిళ్ళ చైతన్యంతో
సంకెళ్లను బద్దలు కొట్టిన స్వేచ్ఛా పతాక!
బంధనాలు తొడిగి
అన్నానికి, అక్షరానికి దూరం చేసినా
వర్ణబేధం చూపి వంచింపజూసినా
వేల యేళ్ళ వైభవాన్ని వేర్లతో సహా పెకిలించివేసినా
కష్టాలు, కన్నీళ్ళే పాఠాలుగా
మనిషీ మనిషీ కలిసి
అడుగూ అడుగూ కలిపి
అలుపెరుగని పోరాటంతో
సామ్రాజ్యవాదాన్ని పీచమడచి
స్వాతంత్య్రాన్ని సాధించుకున్న ధీర!!
గర్వంగా తలెత్తుకుని
పునరుజ్జీవనదిశగా పురిటినొప్పులు పడుతూనే
ముందున్నది మనకు మంచి కాలమేనని
ఆశల చిగురుల్ని జనం మదిలో
అంకురింపజేసిన స్వాభిమాన!!
- రాపోలు సీతారామరాజు, rsrraju@gmail.com

(గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం వారు ప్రపంచ ప్రవాస
తెలుగు వారికి నిర్వహించిన పోటీలో ఉత్తమ కవితగా ఎంపికైంది)

283
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles