అలన్ సీగర్


Sun,January 13, 2019 10:55 PM

(1888, జూన్ 22-1916, జూలై 4)
Alan-Seeger
దేశభక్తిని, స్వీయ వ్యక్తిత్వాన్ని, సౌందర్యాత్మక భావజాలాన్ని, యుద్ధాన్ని, కవిత్వాన్ని సమానంగా ప్రేమించిన అరుదైన సైనిక కవి అలన్ సీగర్! న్యూయార్క్ నగరంలోని ఓ కులీన కుటుంబంలో జన్మించిన సీగర్, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో భావవాద కాల్పనిక కవిత్వానికి ఆకర్షితుడై, T.S.Eliot రచనల చేత ప్రభావితమై, బాధ్యతలేవీ లేకుండా ప్రాకృతిక సౌందర్యారాధనలోనే జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు, కమ్యూనిస్ట్ విప్లవకారుడు John Reedతో కలిసి ఒకే ఇంట్లో కొంతకాలం నివసించినప్పటికీ, వాస్తవికత కన్నా, కాల్పనికత వల్లే జీవితం మీద ప్రేమకు కారణమని నమ్మాడు. తన ఆలోచనలకు, భావాలకు న్యూయార్క్ కన్నా, పారిస్ నగరం అనుకూలంగా ఉంటుందని భావించి, పారిస్‌కు వెళ్లి అక్కడ స్థిరపడి, అక్కడి జీవనశైలితో ఎం తో మమేకమయ్యాడు. 1914లో మొదటి ప్రపంచయుద్ధం మొదలైనప్పుడు, తాను ఎంతగానో ప్రేమించిన ఫ్రెంచ్ దేశం తరుపున సైన్యంలో చేరాడు. ఆయన రాసిన I Have a Rendezvous wit h Death కవిత ప్రపంచ సాహిత్యంలోని యుద్ధ కవితల్లోనే మహోన్నతమైన కవితగా ప్రశంసలు పొందడమే గాక, అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ కెన్నడీకి అత్యంత ఇష్టమైన కవితగా కూడా ప్రత్యేకత ను సాధించింది. అయితే యుద్ధం మీద ఇంత చక్కటి కవిత రాసిన సీగర్, యుద్ధ క్షేత్రంలోనే ప్రాణాలు కోల్పోవడం ఒక విషాదం! తనకు నచ్చిన దేశంతో ప్రేమలో పడి, ఆ దేశం కోసం తన ఆఖరి ఊపిరిని కూడా అర్పించిన సీగర్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం Croix De Guerre, Medallie Militaire అవార్డులతో సత్కరించడమే కాక, Biarritz నగరంలోని ఒక వీధికి ఆయన పేరును పెట్టి, నీరాజనా లు అర్పించింది!

మృత్యువుతో ములాఖాత్!

ఒకానొక వివాదాస్పద సరిహద్దుల కంచె వద్ద
మృత్యువుతో నాకు ముఖాముఖి జరిగింది
గలగల సవ్వడుల నీడలతో
వసంతం తిరిగొచ్చిన సమయాన
యాపిల్ తోటల పరిమళాలు గాలినంతా నింపిన క్షణాన
గతించిన దుఃఖ దినాలను, విషాద సన్నివేశాలను
వసంతం తిరిగి తీసుకొచ్చిన క్షణాన
నాకు మృత్యువుతో సమావేశం జరిగింది!
బహుశా అతనేననుకుంటా..
నా చేతిని తన చేతిలోకి తీసుకొని
తన చీకటి దేశం వైపు నన్ను తీసుకెళ్ళింది..
నా కళ్ళని మూసేసి నా ఊపిరిని లాగేసింది
నేనింకా అతనిని దాటి వెళ్లినట్టు లేను
చరియలు విరిగిపడ్డ కొండచివరి అంచుల మీద
వసంతం మళ్లీ తిరిగొచ్చిన సంవత్సరాన
గడ్డి పూవులు తొలిగా వికసించిన కాలాన
నాకు మృత్యువుతో ముచ్చట మొదలైంది..
దేవుడికి ఎప్పుడో తెలుసు
ఎక్కడైతే పట్టు బట్టల్లో దాగిన మెత్తలు
దిగువ దాకా వ్యాపించిన సుగంధాలు
ప్రశాంత నిద్రని దోచేసిన ప్రేమలు ఉంటాయో..
ఎక్కడైతే గుండెకు చేరువగా మరో గుండె చప్పుడు
ఊపిరితో ఏకమైన మరో ఊపిరి
విరామ మెలుకువలు అరుదుగా ఉంటాయో
అక్కడ లోతుల్లోకి విస్తరించడమే మేలని!
కానీ నేనింకా మృత్యువుతో చర్చలు జరుపాల్సి ఉంది
ఒకానొక దగ్ధ నగరంలో అర్ధరాత్రి సమయాన
వసంతం మళ్లీ ఉత్తరాది దిశగా సంచరించే కాలాన
నేను ప్రతిజ్ఞ చేసిన వాక్యాలంత నిజంగా..
నా సంప్రదింపులలో నేను
మృత్యువుతో రాజీ పడలేను...!
ఆ ములాఖాత్లో నేను విఫలం కాలేను..!!
మూలం: అలన్ సీగర్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles