నిర్మాత ఎవ్వరో..?


Sun,January 13, 2019 10:55 PM

నా బాధ ఎవళ్లతో చెప్పుకోవాలి
వినగల్గిన వాళ్లుంటే వినండి
మొదటి నుంచీ నామీద
పరాయి వారిదే హుకూమత్
నా పిల్లలు దక్కనీలు కాగా..
అరేబియా నుంచో, ఇరాన్ నుంచో
పొట్టచేత పట్టుకొని వచ్చిన
అఫాకీలూ, సఫావీలు నన్ను
కొల్లగొట్టి, నా పిల్లలపై
నిరంకుశాధికారం చెలాయించినారు
దేవ సభకు సరితూగే
నమూనా-ఎ-దర్బార్ ఇలాహీలలో
పేదలకే కాదు, మనుషులకే
అసలైన మనుషులకే దూరమైన
సుల్తాన్‌లు, రాజ్యమేలినారు
మస్నద్‌లు, రత్న కంబళాలు
పరచినారని మురవనా.., లేక
అపాషీ చెప్పులతో
వాటిపై నయగారంగా నడిచారని
గర్విస్తూ, పరవశించి పోనా..
లేక తిండిలేక బట్టలేక
గూడులేక నన్ను నిర్మించిన
స్వేదజీవి బక్క చిక్కి
చచ్చినాడని వగవనా..?
నన్నెవ్వడు కట్టించితేనేమి?
కూలీలయిన నేమి? కుతుబ్‌షా
అయిన నేమి? అబద్ధాలలోంచి
అసలు నిర్మాత ఎవరో పరిశోధించండి
నా బాధకు కారణం నా రాతల్లో
జాగ్రత్తగా వెదకి పట్టుకోండి..
దాద్‌మహలూ, అమన్ మహలూ
గోలకొండలో న్యాయం చేసినవా?
దారుల్ జఫర్, దారుల్ జిహాద్
ఎవనివిజయానికి గుర్తులు బాబూ?
జమాలూ బాజుబందులైతేనేమి
కూర్పాసమూ, రత్నఖచిత భుజకీర్తులైతేనేమి
సుల్తానైనా, షాహన్‌షాహ్ అయినా
రాజయినా, చక్రవర్తి అయినా
బాబూ, నన్నుద్ధరించిందేమీ లేదు
తరఫ్‌దార్, మీర్ జుమ్లీ
ఐనుల్ ముల్క్, అమిల్
మజుందార్- అందరూ
సుల్తాన్‌లో, మహారాజులో
సర్ ఖెయిల్‌లే, (అంగరక్షకులే)
నన్నుద్ధరించిన వాడు ఒక్కడంటే
ఒక్కడైనా లేడు.
షా మంజిళ్లతో, ఆ జన్మ ఖైదీల
జననాలతో, భూగర్భ మురికి కాల్వలతో
కాదు, నే నేర్పడేది
ఇప్పుడు,అప్పుడు నేననాధనే!
భాగ్యనగరమైన నా కడుపులో
ఏమున్నదని, ఏ జీవం ఉన్నదని
పిచ్చి ప్రజలారా! నాలోకి వస్తున్నరు?
రాకండి-నిజం- ఉన్న చోటన్నే ఉండండి
మీ చెరువులు నిండుతున్నవి
మీ ఇళ్లల్లోకే నల్లాలొస్తున్నవి
కోటి ఎకరాల మాగాణంలో
ధాన్య స్వర్ణం పండించుకోండి
కల ఫలించి తీరుతుంది.
హైదరాబాధ పోతుందని
నిజంగా నమ్మండి-
ఎప్పుడూ, ఎవరో ఒకరి చేత దోచబడిన
దీన నగరాన్ని నేను-నా మాట నమ్మండి
వృత్తులు వదలి చెడిపోకండి
నాలుగు సౌధాలు, రాజ వీధులు
ఇవే నేనని నమ్మించిన వారివేళ
నన్ను తానే నిర్మించానని ప్రగల్భాలు
పలుకుతున్నాడు!
తెలంగాణ మంతా మీ
సర్ఫేఖాస్ అయినప్పుడే ఈ
హైదరాబాద్ నిర్మాణమయినట్లు
నా బాధ తీరినట్లు.. నమ్మండి...
- ముదిగొండ వీరభద్రయ్య, 92462 76573

475
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles