పాగల్ చందమామ


Sun,January 6, 2019 11:17 PM

Moon
ఈ పాగల్ చందమామ
నా మాటను పట్టించుకోదు
ఎంత చెప్పినా
చీకటి పడ్డాకే
బయటకు బయలుదేరుతుంది
అందంగా వుంటుంది
హుందాగా బతుకుతుంది
మసక పడ్డాక మంచిదికాదు
సాయంకాలం రావద్దంటే
భయం లేకుండా వస్తుంది
వీధుల్లో కుక్కలుంటాయి
మూల మలుపు దగ్గర
అల్లరి మూకలుంటాయి
కుక్కలు మీదపడి కరిచినా
అల్లరి మూకలు వెంటపడి చెరిచినా
ఎవ్వరూ అడ్డం రారు
ఎక్కడ చెప్పుకున్నా
ఈ అడవిలో
ఏమీ లాభముండదు
నా సంగతి వేరు
అర్ధరాత్రి తిరిగి తిరిగి
గాయాలు ఏరుకొంటాను
ఆగమైన వాళ్లకు
తెల్లారేదాకా తోడుగా నడుస్తాను
ఇంకా ఎన్నిరోజులుంటుందో
ఈ అమాయకత్వం
పోయి పోయి దొంగలు పడే వేళ్లకు
దోచుకొమ్మన్నట్టుగా
చిమ్మ చీకట్లోనే
మిల మిల మెరిసే
చిరునవ్వులు ధరించి వస్తుంది
ఈ నిర్మానుష్యపు
ఎడారి దారిలో
బందిపోట్లలా
గొడ్డుమబ్బులు అడ్డంగా వుంటాయి
ఎదురుగా కొండచిలువ విషంలా
రాహువు బుసలు వినిపిస్తాయి
అందుకే చెపుతున్నా!...
ఓ చందమామా
చుక్కల మెలి ముసుగులో
వెన్నెల గుర్రం మీద
అల్లి రాణిలా
ఈ రాత్రిపూటనే రాకు!
వస్తే
రావడం తప్పదంటే..
గాండ్రించే
తెల్లని పులిలారా!
ప్రళయం లాంటి చీకట్లో
వెల్తురు నింపడానికి
దీపం పట్టుకొనిరా!
నేను కలగన్న
అపురూపమైన
రూపంతో రా!
- ఆశా రాజు, 93923 02245
(ముద్దుగా కొందర్ని, కొన్నిసార్లు
పాగల్ అని పిలుచుకుంటాం
పాగల్ అంటే పిచ్చితనం)

525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles