మేరీ ఎలిజెబెత్ ఫ్రెయ్


Sun,December 23, 2018 11:01 PM

(1905, నవంబర్ 13-2004, సెప్టెంబర్ 5)
Mary-Elizabeth-Frye
ఒక సృజనశీలికి కవిగా ప్రఖ్యాతి రావడానికి ఎన్ని కవితలు రాయాలి? ఎన్ని పుస్తకాలు రాయాలి? వంద, రెండొందలు, మూడొందలు? అవేవీ కాదు కేవలం ఒక్క కవితతోనైనా ప్రపంచ ప్రఖ్యాతి సాధించవచ్చని నిరూపించిన కవి మేరీ ఎలిజెబెత్ ఫ్రెయ్! అమెరికా ఒహియోలోని డేటన్‌లో జన్మించిన మేరీ తన 3వ ఏటనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయింది. పెద్దగా చదువుకోకపోయినా విస్తృత సాహిత్యాధ్యయనంలో తనకు తాను ఒంటరితనాన్ని అధిగమించేది. దుస్తులు-పూల దుకాణాన్ని నిర్వహించే సాధారణ గృహిణిగానే కొనసాగి న మేరీ, రెండో ప్రపంచ యుద్ధకాలంలో తన దగ్గర పనిచేసే ఓ జర్మన్ యూదు అమ్మాయి తన తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న పరిస్థితికి చలించి, 1932లో ఒక కవితను రాసింది. Do Not Stand at My Grave and Weep! అయితే ఈ కవితను ఎంతోమంది ఎవరికి వారు తామే రాశామని ప్రకటి స్తూ ఎన్నెన్నో వివాదాలను రగిలించినప్పటికీ, 1988లో జరిగిన పరిశోధనలో ఈ కవితను రాసింది ఆమెనే అని నిర్ధారణ అయిం ది. ఇంగ్లీష్ సాహిత్యంలో మృత్యు స్మృతికవితలలో అత్యంత ప్రజాదరణను, ప్రాముఖ్యాన్ని సాధించిన ఈ కవిత - ఇప్పటికీ విపత్తు లు, విధ్వంసాలు, యుద్ధాల్లో మరణించిన ప్రజ ల బంధువులకు ధైర్యాన్ని, ఓదార్పునిచ్చే కవితగా చిరస్మరణీయ స్థాయిని పొందిం ది. 1996లో బీబీసీ నిర్వహించిన సర్వేలో The Nations Favourite Poem గా అరుదైన గౌరవాన్ని కూడా అందుకుంది.

నా సమాధి చెంత ఏడ్వకండి..!

నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా హితులారా!
నా సమాధి వద్ద నిలబడి
నా కోసం ఏడ్వకండి
నా ఖననస్థలి చెంత
నా కోసం చింతించకండి
నేను అక్కడ లేను
నేను అక్కడ నిద్రిస్తూ కూడా లేను!
నేను ఇప్పుడు
సహస్ర పవనాల వీచికను
మంచుపై కురుస్తున్న వజ్ర వాహికను
కోతకొచ్చిన ధాన్యంపై ప్రసరిస్తున్న సూర్యరశ్మిని
సున్నితంగా కురుస్తున్న శిశిర కాలపు వర్షాన్ని!
వేకువ సందడికి నువ్వు మేల్కొన్న క్షణాన
వేగంగా సంచరించే జనం హోరును నేనే
ఆకాశంలో వృత్తాకారంలో
ఎగురుతున్న ప్రశాంత పక్షుల హొయలును నేనే
రాత్రి చీకట్లలో
మిళుకు మిళుకున మెరిసే మెత్తని నక్షత్రాల్ని
నేనే..!
అందుకే నా సన్నిహితులారా,
నా సమాధి వద్ద నిలబడి
నా కోసం దుఃఖించకండి
నేను అక్కడే ఆగిపోలేదు
నేను మరణించనూ లేదు..!
మూలం: మేరీ ఎలిజెబెత్ ఫ్రెయ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

497
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles