క్రాంతి రథం


Sun,December 23, 2018 11:01 PM

KALESHWAR
వడివడిగా సుళ్ళు తిరుగుతూ
బీళ్ళన్నీ మళ్ళుగ జేస్తూ
పచ్చదనం ప్రమాణముగా
ప్రగతి రథం కాళేశ్వరము!
ప్రాణహితతో ప్రాణం పోసుకు
గోదావరి నదీమ తల్లిగ
హొయలొలికే కిన్నెరసాని
దేశానికే మకుటాయమణి!
కాళేశ్వర శివుడి గంగలా
పెల్లుబికే జలతాండవమై
జగమంతా నివ్వెరపోయే
సాగునీటి అమేయ నగగా
ప్రవహిస్తూ పరుగులు పెడుతూ
వడి వడిగా కాళేశ్వరము!
జానపదుల జీవనసాక్షిగ
నర్తించే నయాగరాలై
పదపదమున పల్లె నదాలై
ప్రవహిస్తూ పరుగులు పెడుతూ
ప్రగతిథం కాళేశ్వరము!
దాహార్తుల దూపతీర్చగా
అన్నార్తుల అన్నపూర్ణగా
మాగాణుల తెలంగాణమై
మట్టిని బంగారం జేయగ
వడివడిగా పరుగులు పెడుతూ
ప్రగతిరథం కాళేశ్వరము!
నీళ్ళన్నీ నిప్పుల నిజమై
నీళ్ళే ఒక భవిష్య విజనై
జనహితమే జయకేతనమై
కర్షకుల కలల పంటగా
ప్రవహిస్తూ పరుగులు పెడుతూ
క్రాంతిరథం కాళేశ్వరము!
రైతుకంట ఆనందాలు
గుమ్ములింట నవధాన్యాలు
పురివిప్పే పల్లె మయూఖం
పరిపుష్టిగ గ్రామ వికాసం
ప్రవహిస్తూ పరుగులు పెడుతూ
ప్రగతిరథం కాళేశ్వరము!
అలల కలల మేధోమథనం
అపూర్వమై నిలిచిన వరం
అజేయమై నిర్మిత దృశ్యం
ప్రగతిరథం కాళేశ్వరము!
అద్భుతాలు సాంకేతికతతో
అహర్నిశల శ్రమ కార్మికులతో
అనుదినమొక శ్రమైక సమరం
చరిత్రలో అమరం అమరం!
ప్రవహిస్తూ పరుగులు పెడుతూ
క్రాంతిరథం కాళేశ్వరము
- డాక్టర్ వాణి దేవులపల్లి 98669 62414

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles